ఖాతాదారులకు ఆర్‌బీఐ హెచ్చరిక

9 Feb, 2018 08:48 IST|Sakshi

సాక్షి, ముంబై : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్‌బీఐ పేరిట ఓ నకిలీ వెబ్‌ సైట్‌ ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడుతోంది. ఖాతాదారుల నుంచి వివరాలను సేకరిస్తుండటంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచిస్తూ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘దయచేసి ఆ వెబ్‌సైట్‌ను ఎవరూ నమ్మకండి. అది నకిలీది. ఎవరూ అకౌంట్‌కు సంబంధించి వివరాలను సమర్పించకండి. బహుశా అది ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన ముఠా అయి ఉండొచ్చు. ఈ వ్యవహారంలో సైబర్‌ విభాగానికి ఫిర్యాదు చేశాం. ఆర్‌బీఐ ఏనాడూ వినియోగదారుడి వివరాలను ప్రశ్నించదు. గమనించగలరు’ అంటూ  ఆ ప్రకటనలో పేర్కొంది. www.indiareserveban.org పేరుతో అది చెలామణి అవుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

కాగా, గత కొన్నేళ్లుగా.. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ పేరిట భారీ మోసాలకు కొన్ని ముఠాలు పాల్పడుతున్నాయి. క్రెడిట్‌ కార్డుల జారీ, యాప్‌ ద్వారా నగదు బదిలీ తదితరాల ద్వారా కోట్ల రూపాయాల్లో ఖాతాదారుల నుంచి సొమ్మును దోపిడీ చేశాయి. ఆయా కేసుల్లో చాలా వరకు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా నకిలీ వెబ్‌సైట్‌లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయని.. వాటి హోం పేజీ... ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను పోలి ఉండటంతో ఖాతాదారులు సులువుగా మోసపోతున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఓ అధికారి సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు