పాక్ ఆర్మీ చీఫ్ ప్రేలాపనలు..

14 Jun, 2015 00:40 IST|Sakshi
పాక్ ఆర్మీ చీఫ్ ప్రేలాపనలు..

ఉగ్రవాదులకు భారత్ మద్దతిస్తోందని రహీల్ ఆరోపణ
తమకు జాతి ప్రయోజనాలే పరమావధి అని వ్యాఖ్య

 
ఇస్లామాబాద్: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మరోసారి నోరుపారేసుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ కాలరాస్తోందని, ఉగ్రవాద మూకలకు మద్దతిస్తూ తమ దేశంలో అస్థిరత సృష్టించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. తమ ఆందోళనను ప్రపంచ దేశాలన్నీ ఆమోదిస్తున్నాయన్నారు. శనివారం నేవీ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనతోపాటు బెలూచిస్తాన్, గిరిజన ప్రాంతాలు, కరాచీలో రక్తపుటేర్లు పారేలా చూడాలన్నదే శత్రువు ఉద్దేశం. శాంతి కోసం పాక్ ఇతర దేశాలకు స్నేహహస్తం చాస్తుంది. కానీ జాతి ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని, దేశ గౌరవాన్ని మాత్రం పణంగా పెట్టబోదు’’ అని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఉగ్ర మూకలను ఏరిపారేసేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ జర్బ్-ఎ-అజబ్’ సత్ఫలితాలు ఇస్తోందని, నిరాశలో కూరుకుపోయిన ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారన్నారు. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపీసీఈసీ)తో ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌తోపాటు భద్రతాపరమైన ప్రయోజనాలను కాపాడుకునేందుకు పాక్ ఎంతటి మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉందని మూడ్రోజుల కిందటే రహీల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
 
 ‘సోపోర్‌కు, పారికర్ వ్యాఖ్యలకూ లింకు..’
 శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు, ఇఖ్వానీలు తిరిగి రానున్నారంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలకూ సంబంధం ఉందని శనివారం ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ‘మిలిటెంట్లను హతమార్చేందుకు మిలిటెంట్లను ఉపయోగిస్తామని రక్షణ మంత్రి అంటున్నారు. అంటే ప్రభుత్వ అండ ఉన్న గన్‌మెన్(ఇఖ్వాన్)ను ఏర్పాటు చేయడమే కదా’ అని ప్రశ్నించారు. జమ్మూ నుంచి ముస్లింలను ఖాళీ చేయించడమే ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అని ఒమర్ ఆరోపించారు.  
 

మరిన్ని వార్తలు