సమరానికి సై

3 Apr, 2016 02:07 IST|Sakshi
సమరానికి సై

నాలుగు రాష్ట్రాలు (పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ), ఒక కేంద్రపాలిత ప్రాంతం(పుదుచ్చేరి) అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో పోలింగ్ సోమవారం ప్రారంభమౌతోంది. ఈ నెల 4న ఉదయం పశ్చిమబెంగాల్, అస్సాంలో మొదటి దశ పోలింగ్ మొదలవుతుంది. కిందటేడాది బిహార్ ఎన్నికల తర్వాత దేశంలో జరుగుతున్న పెద్ద ఎన్నికలివే. ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకూ దాదాపు నెలన్నర పాటు జరిగే ఈ సమరంలో 824 అసెంబ్లీ స్థానాల్లో 17 కోట్లకు పైగా ఓటర్లు తమ ప్రతినిధులను నిర్ణయిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో మే 16న ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక, కల్లోలిత ప్రాంతంగా భావించే బెంగాల్లో ఈ నెల 4, 11, 17, 21, 25, 30, మే 5న పోలింగ్ జరుగుతుంది.

వచ్చే నెల 19న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ రాష్ట్రాల్లో పాలకులెవరో తేలిపోతుంది. రెండు తూర్పు-ఈశాన్య రాష్ట్రాలు, రెండు ద క్షిణాది రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశమిచ్చే ‘నోటా’ గుర్తు తొలిసారి ఈవీఎంల్లో కనిపిస్తుంది. కేంద్రంలో పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయ్యే సమయంలో జరుగుతున్న ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఉంది. ఈ 4 రాష్ట్రాల్లో దేంట్లోనూ బీజేపీ అధికారంలో లేనప్పటికీ-కిందటేడాది ఢిల్లీ, బిహార్ ఎన్నికల ఓటమి బాధ నుంచి బయట పడాలంటే ప్రధాని మోదీ అస్సాంలో మొదటిసారి కాషాయ పక్షాన్ని గెలిపించక తప్పదు.

అలాగే, ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా వేళ్లూనుకుని, ఎన్నో ఏళ్లుగా అసెంబ్లీలో ఖాతా తెరవలేకపోయిన కేరళలో ఒక్క సీటయినా గెలవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఇక్కడ బీజేపీ కూటమికి ఊహించినదాని కన్నా ఎక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికారం మళ్లీ దక్కే అవకాశముంటుంది. అలాగే, వామపక్షాలు గత ఐదేళ్లుగా చతికిలపడి ఉన్న బెంగాల్‌లో మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించడం కూడా బీజేపీ కోర్కెల్లో ఒకటి. మరో మహిళా సీఎం ఏలుబడిలోని తమిళనాడులో బలం పెంచుకోవడం కూడా బీజేపీ లక్ష్యం. కాంగ్రెస్ విషయానికొస్తే, 2014లో 44 లోక్‌సభ సీట్లతో చావుదెబ్బతిని ఇంకా కోలుకోలేదు.

ఇప్పుడు అధికారంలో ఉన్న అస్సాం, కేరళలో సత్తా నిలబెట్టుకుంటే అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కొంత పరువు దక్కుతుంది. అయితే, కేరళలో ప్రతి ఐదేళ్లకూ పాలక కూటమిని మార్చే అలవాటు మలయాళీలకు అబ్బింది. అస్సాంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉండడం కాంగ్రెస్‌కు అననుకూల అంశమే. 2009 నుంచీ వరుస ఓటములతో త్రిపురకే పరిమితమైన సీపీఎం, దాని మిత్రపక్షాలైన వామపక్ష పార్టీలకు బెంగాల్‌లో విజయావకాశాలు కనిపించకపోయినా, కేరళలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేకుంటే ఈ మధ్య రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిణామాల నుంచి లభించిన ప్రయోజనం కమ్యూనిస్టులకు దక్కకుండా పోతుంది. రాష్ట్రాలవారీగా వివిధ రాజకీయ పక్షాల విజయావకాశాలెలా ఉన్నాయో పరిశీలిద్దాం. 
   
- నాంచారయ్య మెరుగుమాల
 
 పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత కాషాయం?

 అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగింటిలో చిన్న రాష్ట్రమైన అస్సాంలో (అసెంబ్లీ సీట్లు 126) ప్రజలు కిందటి లోక్‌సభ ఎన్నిల్లో బీజేపీకి మొత్తం 14 సీట్లలో ఏడింటిలో పట్టంగట్టారు. 2011 శాసనసభ ఎన్నికల్లో కేవలం ఆరు సీట్లు గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అధిక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించింది. అందుకే దాదాపు 30 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కిందటేడాది బిహార్ ఎన్నికలకు ముందే అస్సాం కాంగ్రెస్ కీలక నేత హిమంతా బిశ్వ శర్మ మరో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడం తో కాషాయపార్టీ వ్యూహం బయటపడింది. 2001 నుంచీ జరిగి న మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేసిన బడా నేత శర్మ. అదీగాక 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న 79 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనపై అస్సామీలు విసుగెత్తిపోయారు.

జాతుల మధ్య ఘర్షణలకు నిలయమైన ఈ రాష్ర్టంలో గడచిన ఐదేళ్లలో సాగిన ఊచకోతల్లో వందలాది మంది మరణించారు. మరో పక్క బంగ్లాదే శ్ నుంచి చొరబాటుదారులు ప్రవేశించి భారత పౌరులుగా మారుతున్నారన్న ఆరోపణ లు... 1980ల్లో తీవ్రమైన విదేశీయుల వ్యతిరేక ఉద్యమకాలం నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. చట్టవ్యతిరేకంగా వచ్చే బంగ్లాదేశీ ముస్లింలకు కాంగ్రెస్ ప్రోత్సాహం ఉందనే ప్రచారాన్ని బీజేపీ కొన్ని దశాబ్దాలుగా చే స్తూనే ఉంది. మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకత ఒక్కటే తమను గెలిపించదని బీజేపీ గ్రహించింది. అస్సాం ఉద్యమ నేతలు స్థాపించిన ఒకప్పటి పాలక పార్టీ అసోం గణపరిషత్(ఏజీపీ), ఆదివాసీ వర్గం బోడోలకు ప్రాతినిధ్యం వహించే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కిందటేడాది బిహార్ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు అస్సాంలో చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తెలివిగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. బిహార్‌లో జేడీ యూ నేత, సీఎం నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగి నష్టపోయిన విషయం ప్రధాని మోదీ మరవలేదు.
 
 కీలకాంశాలివే..
 అస్సాంలోని 126 సీట్లలో 38 చోట్ల తేయాకు ఓటర్లు మరోసారి క్రియాశీలకం కానున్నారు. దాదాపు 35 లక్షల మంది కార్మికులు (ఈ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో 30 శాతం) ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 32 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ ఒకటి, ఏజీపీ మూడు, ఏఐయూడీఎఫ్ రెండుసీట్లు గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ మూడు సీట్లు గెలుచుకోగా.. ఒకటి కాంగ్రెస్ వశమైంది. అయితే ఈ నాలుగు జిల్లాల్లో తేయాకు కార్మికుల కుటుంబాలకే అన్ని పార్టీలు టికెట్ ఇవ్వటంతో.. పోటీ రసవత్తరంగా మారింది. దీనికి తోడు వరదలు, పేదరికం, తిరుగుబాట్లు ఈ ప్రాంతంలో చాలాకాలంగా తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. అయితే వెనుకబాటుకు గురైన అస్సాంకు యూపీఏ సర్కారు ప్రత్యేక హోదా కల్పిస్తే.. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఈ హోదాను వెనక్కు తీసుకుందని కాంగ్రెస్ విమర్శిస్తుండగా.. పదిహేనేళ్లుగా తరుణ్ గొగోయ్ అధికారంలో ఉన్నా రాష్ట్రం వెనుకబాటుకు గురైందని.. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని బీజేపీ ప్రచారంలో చెబుతోంది.
 
 సమస్య గొగోయ్ కాదు..గరీబీ అన్న మోదీ
 అందుకే పదిహేనేళ్లుగా అస్సాంలో అధికారపీఠంపై కూర్చొన్న సీఎం గొగోయ్‌ను బ్రహ్మపుత్రలో కలపాలని అనకుండా మోదీ, ‘‘ఇక్కడ సమస్య గోగోయ్ కాదు, గరీబీ(పేదరికం). గొగోయ్‌జీ, మీకు కొన్నేళ్లలో 90 ఏళ్లు నిండుతాయి. నాకంటే పెద్దగా మీరు నన్ను ఆశీర్వదించాలి’’అంటూ అస్సామీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే బిహార్‌లో పోటీ నితీశ్‌కూ తనకే మధ్యే అన్నట్టు వ్యవహరించిన ప్రధాని ఇక్కడ ఆ పొరపాటు చేయలేదు. ప్రస్తుత కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌నే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ ప్రచారం చేయడం విశేషం. ‘‘అస్సాంలో ఉన్న ఒకే ఒక ఆనందం సర్బానంద. ఆయనకు ఐదేళ్లు పాలించే అవకాశమిస్తే, బీజేపీ దాని మిత్రపక్షాలు రాష్ట్రాన్ని కష్టాల నుంచి బయటపడేస్తాయి’’ అని కూడా మోదీ సోనోవాల్‌ను ప్రశంసిస్తూ ఎన్నికల సభల్లో ప్రసంగించారు.
 
 మొదటి సర్వేలు బీజేపీకి అనుకూలం
 మూడు నెలల క్రితం జరిపిన ఎన్నికల సర్వేల్లో లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే బీజేపీ అస్సాంలో మెజరిటీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషించారు. అయితే, ఈ మధ్య వేసిన అంచనాల ప్రకారం చూస్తే కాంగ్రెస్, బీజేపీ కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుందని స్పష్టమౌతోంది. అయితే, కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(78) తర్వాత ఎక్కువ సీట్లు గెలుచుకున్న ముస్లింల పార్టీ ఆలిండియా యునెటైడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్-18) నేత బద్రుద్దీన్ అహ్మద్ పలుకుబడి, జనాకర్షణ శక్తి తగ్గిందని చెబుతున్నారు. కోట్లాది రూపాయల అత్తరు వ్యాపారం చేస్తూ ‘పెర్‌ఫ్యూమ్ కింగ్’గా పేరుతెచ్చుకున్న అహ్మద్ ఈ విషయం గ్రహించి కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల సమస్య, అస్సాంలో పెరుగతున్న ముస్లింల జనాభాను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్న బీజేపీ- మతాల ప్రకారం జనం చీలిపోయే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మరో విశేషమేమంటే, కిందటేడాది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన హిమంతా బిశ్వ శర్మ నేరుగా అహ్మద్‌పై విమర్శల బాణాలు విసురుతున్నారు. ‘‘ఇవి ఇతర ఎన్నికలలాంటివి కావు. బద్రుద్దీన్ అనే నేత సీఎం కావాలనుకుంటున్నాడు. దిగువ అస్సాంలో గత పాతికేళ్లలో పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు అసెంబ్లీకి ఎన్నికవ్వాలని ఆశించే అభ్యర్థులు నగావ్ జిల్లా బతద్రవలోని ప్రసిద్ధ వైష్ణవ సంఘసంస్కర్త శ్రీమంత శంకరదేవ ఆలయానికి వెళ్లి ఆయన ఆశీస్సుల కోసం ప్రార్థించేవారు. ఇప్పుడేమో అలాంటి ఆశావహులు బద్రుద్దీన్ ‘దువా’(దయ)కోసం ఆరాటపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను మనం ఆపాల్సిందే. దిస్పూర్(రాజధాని)లోకి ఆయనను అడుగుపెట్టనీయకూడదు.’’ అంటూ హిమంతా శర్మ హిందూ ఓటర్లను రెచ్చగొడుతూ ప్రసంగిస్తూన్నారు.
 
 సైకియా, మహంతా, గొగోయ్
 అస్సాం మొదటి సీఎం గోపీనాథ్ బోర్దోలోయ్(1946-50). ఆయన తర్వాత ఎక్కువ కాలం సీఎంగా ఉన్న నేతలు హితేశ్వర్ సైకియా(1983-85, 1991-96), ప్రఫుల్ల కుమార్ మహంతా(1986-91, 1996-2001). రెండుసార్లు సీఎం అయిన సైకియా పదవిలో ఉండగా మరణించారు. సైకియాకు మంచి మిత్రుడైన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గువాహటీలోని సైకియా ఇంట్లో అద్దెకుంటున్నట్లు చూపించి అస్సాం నుంచి రాజ్యసభకు పలుమార్లు ఎన్నికయ్యారు ఈ క్రమంలో వివాదంలో ఇరుక్కున్నారు. అస్సాం ప్రతినిధిగానే మన్మోహన్ ప్రధాని పదవిని రెండుసార్లు చేపట్టారు. 34 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన అస్సాం ఉద్యమ నేత మహంతా ఏజీపీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పార్టీ 2001 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ  కాంగ్రెస్ తరఫున ప్రస్తుత సీఎం గొగోయ్ అధికారంలో కొనసాగుతున్నారు.
 
 చావని కాంగ్రెస్ ఆశలు
  2014లో కేవలం మూడు లోక్‌సభ సీట్లతో సరిపుచ్చుకున్న కాంగ్రెస్ వరుసగా నాలుగో విజయానికి గట్టి ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు ముఖ్యమంత్రి గొగోయ్ కొడుకు, కాలియాబోర్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విస్తృతంగా పర్యటిస్తూ కాషాయ కూటమిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బ్రిటిష్ మహిళను పెళ్లాడిన గౌరవ్‌ను తండ్రి తరుణ్‌కు వారసునిగా భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కూటమి విజయం సాధిస్తే కేంద్రమంత్రి సోనోవాల్ సీఎం అవుతారు. అప్పుడు ఆదీవాసీ అయిన సోనోవాల్ అస్సాం రెండో ఎస్టీ సీఎంగా చరిత్రకెక్కుతారు. 1979లో కచ్చా సోనోవాల్ వర్గానికే చెందిన ఆదివాసీ జోగేంద్రనాథ్ హజారికా జనతాపార్టీ తరఫున మూడు నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నెల 4న 65, 11న 61 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది.

మరిన్ని వార్తలు