వేతన జీవులకు నిజంగా ఊరటేనా.. అసలు నిజం ఇదీ!

1 Feb, 2019 19:07 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రజలను ఆకర్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందంటూ విపక్షాలు మండిపడుతున్న నేపథ్యంలో ఆర్థిక నిపుణులు మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు. ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌’ లో వేతన జీవులకు భారీ ఊరటగా పరిగణిస్తున్న ‘ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెరుగుదల’ లో ఉన్న అసలు నిజాన్ని గమనించాలన్న వాదన వినిపిస్తున్నారు. శుక్రవారం నాడు ఆర్థిక మంత్రి గోయల్ చేసిన పన్ను మినహాయింపు ప్రకటన ప్రకారం రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నపుడు మాత్రమే పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఈ పరిమితి రూ. 5 లక్షలను దాటిన పక్షంలో పన్నుకు అర్హమైన ఆదాయాన్ని.. ప్రస్తుత స్లాబ్‌ రేట్లను అనుసరించి టాక్స్‌ వసూలు చేస్తారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షికాదాయం రూ. 6 లక్షలు అనుకుందాం. అలాంటి తరుణంలో పై లక్ష రూపాయలు మాత్రమే పన్నుకు అర్హమైన ఆదాయం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్లాబ్‌ రేట్ల ప్రకారం... రూ. 2.5 లక్షలు- రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నట్లయితే దానిపై 5 శాతం పన్ను విధిస్తారు. అంటే 12,500 రూపాయలు అన్నమాట. ఒకవేళ రూ. 5 లక్షలకు పైబడి ఒక్కరూపాయి ఉన్నాసరే మిగిలిన లక్ష రూపాయల మొత్తానికి 20 శాతం అంటే రూ. 20 వేలు కట్టాల్సి ఉంటుంది. అంటే 12,500 రూపాయలకు అదనంగా మరో 20 వేలు మొత్తంగా 32,500 రూపాయలు పన్ను రూపంలో సమర్పించుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి పన్నుకు అర్హమైన ఆదాయపు పరిమితి ఇప్పటికీ రెండున్నర లక్షలుగానే ఉన్నట్లు కదా. ఇందులో వేతన జీవులు అంతగా సంతోషించదగ్గ విషయం ఏమీ లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆదాయ పన్ను చట్టంలోని ఎనిమిదవ క్లాజ్‌ సెక్షన్‌ 87ఏకు చేసిన సవరణ ద్వారా మూడు లక్షలకు రూ. 2500లుగా ఉన్న టాక్స్‌ రిబేటును సవరించి ఆదాయ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచారు. కాగా ప్రస్తుతం ఉన్న స్లాబ్‌ రేట్ల ప్రకారం.. ఆదాయం రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలలోపు ఉన్నట్లయితే 12,500 రూపాయల పన్ను విధిస్తారన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు