అభివృద్ధి మంత్ర.. ‘3ఆర్‌’

9 Apr, 2018 02:23 IST|Sakshi

అందరూ అనుసరించాలి: ప్రధాని

న్యూఢిల్లీ: ‘3ఆర్‌’అనే అభివృద్ధి మంత్రాన్ని అందరూ అనుసరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తక్కువ వినియోగం (రెడ్యూస్‌).. పునర్వినియోగం (రీయూజ్‌).. శుద్ధి చేసి వినియోగం (రీసైకిల్‌).. ఈ మూడు ఆర్‌లు వ్యర్థాల నిర్వహణకు, స్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇండోర్‌లో ప్రారంభం కానున్న ఆసియా, ఫసిపిక్‌ ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్‌ సదస్సు కోసం ప్రధాని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన 3ఆర్‌ అనే బంగారు సూత్రం మానవ జాతి స్థిరమైన అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే ఈ సదస్సు 3ఆర్‌లు నగరాలకు, దేశాలకు ఎలా ఉపయోగపడతాయో విశ్లే షిస్తుందని పేర్కొంది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి అందించాలన్నది ఈ సదస్సు లక్ష్యమని వెల్లడించింది. ఈ నెల 10న ఈ సదస్సును లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ప్రారంభిస్తారు. జపాన్‌ పర్యావరణ శాఖ మంత్రి తదహికో ఇటోతో పాటు పలు దేశాల నుంచి 40 మంది మేయర్లు, భారత్‌ నుంచి 100 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. వీరంతా సమగ్ర పట్టణాభివృద్ధిపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు