‘అక్షయ పాత్ర’లో అల్లం వెల్లుల్లి గొడవ

11 Jun, 2019 16:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఇస్కాన్‌ (ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్సియస్‌నెస్‌) ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘అక్షయ పాత్ర’ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై మరోసారి వివాదం రాజుకుంది. గతంలో ఒడిశా రాష్ట్రంలో తలెత్తిన వివాదానికి ప్రధాన మీడియా ప్రాధాన్యత ఇవ్వగా, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న వివాదానికి ట్విట్టర్‌ వేదికగా మారింది. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తోన్న కూరలు మసాలా దినుసుల వాసనలు లేకుండా చప్పగా ఉంటున్నాయని, విద్యార్థులు వాటిని తినలేక బోరుమంటున్నారంటూ ముందుగా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దానిపై ట్విటర్‌లో వాదోపవాదాలు రాజుకున్నాయి.

అక్షయపాత్ర వంటకాలు అలా ఉండడానికి కారణం వారు వంటల్లో అల్లం–వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకపోవడం. వాటిని ఉపయోగించడానికి వారు విరుద్ధం. ఎందుకంటే అది వారి తాత్విక చింతనకు వ్యతిరేకం. వాటిని తినడం వల్ల మనుషుల్లో కామ, క్రోదాలు ప్రకోపిస్తాయనడానికన్నా ఆధ్యాత్మిక చింతన తగ్గుతుందన్నది ఆ సంస్థ వాదన. మరి వారు పూజిస్తోన్న శ్రీకృష్ణుడు ఇవేమీ తినకుండానే వెయ్యి మంది గోపికలతో శృంగార లీలలు ఎలా నెరపారబ్బ!... ట్విటర్‌లో ఓ గడుగ్గాయి కొంటె ప్రశ్న. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును తప్పకుండా సరఫరా చేయాలంటూ భారత జాతీయ పోషకాల ప్రమాణాల సంస్థ ఆదేశాలను కూడా ఇస్కాన్‌ సంస్థ అమలు చేయడం లేదు. తాము శాకాహారానికి నిబద్ధులమని, కోడిగుడ్డు మాంసాహారం కనుక తాము సరఫరా చేయమన్నది వారి వాదన. అవసరమైతే తాము ఈ పథకం నుంచి తప్పుకుంటాంగానీ సరఫరా చేయమని వారు మొండికేశారు.

ఒడిశాలో సామరస్య పరిష్కారం
ఒడిశాలో కూడా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్‌ సంస్థే అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పిన గుడ్డును సరఫరా చేయడానికి సంస్థ నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారానికి మూడు సార్లు గుడ్లను ఉడకబెట్టి విద్యార్థులకు వడ్డించే బాధ్యతను పాఠశాలల హెడ్‌మాస్టర్లకు అప్పగించింది, ఆ మేరకయ్యే ఖర్చును ఇస్కాన్‌ సంస్థ నుంచే రాబట్టుకోవాలని సూచించింది. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేక వదిలేసింది.

కర్ణాటకలోను ఉత్తర్వులు
జాతీయ పోషక ప్రమాణాల సంస్థ సిఫార్సు మేరకు కూరల్లో అల్లం వెల్లులి, ఉల్లిపాయలను తప్పనిసరిగా వినియోగించాలంటూ 2018, నవంబర్‌ నెలలో కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఇస్కాన్‌ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి బదులు తాము ఈ పథకం నుంచి తప్పుకుంటామని బెదిరించడమే కాకుండా తమ వంటకాల్లో విద్యార్థులకు అవసరమైన పోషకాలు ఉంటున్నాయని వాదించింది. ఈ విషయంలో ‘ఆహారం ప్రాథమిక హక్కు’ కార్యకర్తలు జాతీయ పోషక ప్రమాణాల సంస్థకు కేసును నివేదించగా వారు కూడా పోషకాలు ఉన్నాయంటూ సమర్థించారు. విద్యార్థులకు సరఫరా చేస్తోన్న ఆహారం ఎంత?, అందులో వారు వృధా చేస్తున్నది ఎంత? ఎలా మీరు శాంపిల్‌ను తనిఖీ చేశారంటూ ఎన్జీవోలు సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు.

అక్షయ పాత్ర భోజనం ఉచితం కాదు
ఇస్కాన్‌ సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలు ప్రకారం ఈ సంస్థ దేశంలోని 12 రాష్ట్రాల్లోని 15,024 ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సహాయ పాఠశాలల్లో 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తుంటే ఇది కావాలి, అది కావాలంటూ డిమాండ్‌ పెడతారా?’ అంటూ కొందరు అమాయకంగా ట్వీట్లు పెట్టారు. ఎంతమాత్రం ఈ సంస్థ ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజనానికి ఐదున్నర రూపాయల చొప్పున చెల్లించడంతోపాటు భారత ఆహార సంస్థ నుంచి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ పథకం కింద ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశవ్యాప్తంగా 11.6 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని 9.40 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి.

అయినా చాలడం లేదంటున్న ఇస్కాన్‌
అక్షయ పాత్ర కింద తాము ఖర్చు పెడుతున్న మొత్తంలో 60 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తోందని, 12 రాష్ట్రాల్లో 43 వంటశాలలను సొంత ఖర్చుతో నిర్మించామని, 5,500 మంది ఉద్యోగులకు తామే జీతాలు చెల్లిస్తున్నామని అక్షయ పాత్ర పర్యవేక్షకుల్లో ఒకరైన మోహన్‌దాస్‌ పాయ్‌ వివరించారు. ఇతర ఎన్జీవో సంస్థలకన్నా ఉన్నంతలో శుభ్రంగా విద్యార్థులకు భోజనాన్ని అందిస్తోందన్న కారణంగా అక్షయ పాత్ర సేవలను వదులు కోవడానికి పలు రాష్ట్రాలు సిద్ధంగా లేవు.

అసలు ఈ పథకం ఎలా పుట్టింది?
1920లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడే మద్రాస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిమ్న వర్గాల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ స్వాతంత్య్రానంతరం తమిళనాడు ముఖ్యమంత్రులుగా ఉన్న కే. కామరాజ్, ఎంజీ రామచంద్రన్‌ అన్ని వర్గాల విద్యార్థులకు దీన్ని విస్తరించి పథకాన్ని మెరగుపర్చారు. 1995లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. పిల్లలను బడికి ఆకర్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించింది. 2001లో సుప్రీం కోర్టు ‘ఆహారం ప్రాథమిక హక్కు’కు సంబంధించిన ఓ కేసులో అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఈ పథకాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు