రెగ్యులర్‌ విచారణ ఇప్పట్లో కుదరదు

11 Jun, 2020 01:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కోర్టు విచారణలను గతంలో మాదిరిగానే మళ్లీ ప్రారంభించాలన్న న్యాయవాద సంఘాల డిమాండ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రస్తుతానికి తోసిపుచ్చింది. కరోనా విస్తృతిని పరిశీలించి, జూన్‌ 30న మరోసారి భేటీ కావాలని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఏడుగురు సీనియర్‌ జడ్జీల కమిటీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలో కరోనా నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను కొనసాగించే అవకాశాలపై కమిటీ సమీక్ష జరిపింది. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ ప్రతిపాదనను కమిటీ తోసిపుచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని స్పష్టం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్‌ 30న మరోసారి సమావేశమై, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కమిటీ భావించిందని తెలిపాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆన్‌లైన్‌ విచారణలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు