ఆశలు సమాధి చేస్తూ.. బతుకులను బలి చేస్తూ..

11 Feb, 2019 02:51 IST|Sakshi

ప్రశ్నార్థకంగా గల్ఫ్‌ బాధితుల పునరావాసం 

అక్కడ సంస్థలు, దళారుల చేతిలో మోసం

జీతాలు అందక.. కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు..

ఇక్కడికొస్తే పునరావాసం అందక జీవితం దుర్భరం  

మోసం ఎక్కడైనా ఒక్కటే. ఈ మోసం కారణంగా కొన్ని చోట్ల జీతాలు కోల్పోతుంటే.. మరికొన్ని చోట్ల జీవితాలే గాల్లో కలిసిపోతున్నాయి. గల్ఫ్‌లో ఉద్యోగాలకోసం వెళ్లిన వారి దీనగాథ ఇది. అక్కడ ఉద్యోగాల కోసం మాయావలయంలో చిక్కుకున్నవారు మన తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఉన్నారు. దళారుల చేతిలో మోసపోయినవారు,  నకిలీ వీసాలతో దగాపడిన అమాయకులు, అర్ధంతరంగా ఉద్యోగాలు కోల్పోయినవారు చివరకు అన్ని దార్లూ మూసుకుపోయి స్వదేశానికి  చేరుకుంటున్నారు.పొట్టకూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్ళిన వేలాది మంది అభాగ్యులు.. అక్కడి పరిస్థితిని తట్టుకోలేక స్వదేశానికి తిరిగొచ్చాక ఎలా బతుకుతున్నారనేదానిపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం వారి కుటుంబాల్లో తీరని వ్యధను మిగుల్చుతోంది. 

దగాపడ్డ తెలుగుబిడ్డలు తిరిగి వెనక్కి 
కువైట్, సౌదీ అరేబియా, ఒమన్‌లలో కంపెనీలు మూసివేయడంతో భారతదేశానికి చెందిన ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీలు మూసివేస్తేనో, ఇతర కారణాల వల్లనో ఉపాధి కోల్పోయిన వేలాదిమంది వలస కార్మికులు తిరిగి భారత్‌కి చేరుకుంటున్నారు. గల్ఫ్‌లో చిక్కుకుపోయిన 90,000 మందిని ప్రభుత్వం తిరిగి వెనక్కి రప్పించగలిగింది. అయితే వారికి మూతపడిన కంపెనీల నుంచి రావాల్సిన వేతన బకాయిల విషయంలో మాత్రం న్యాయం జరగలేదు. మరోవైపు ఇలా అర్ధంతరంగా కంపెనీల నుంచి గెంటివేయబడిన వందలాది మందిని తిరిగి స్వదేశానికి రప్పించడంలో తెలంగాణలో కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆ వైపుగా తీసుకున్న చర్యలు శూన్యమే. 

స్వగ్రామాలు వెళ్లేందుకు సైతం డబ్బుండదు 
బాధితులను స్వదేశాలకు తిరిగి తీసుకురావడం వరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కానీ ఒకసారి వలస కార్మికులను స్వదేశానికి చేర్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతేమీ లేదన్నట్లుగా భావిస్తున్నాయి. దీంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. కొందరికి దగ్గర స్వగ్రామాలకు వెళ్ళేందుకు సైతం డబ్బులు లేని దయనీయమైన స్థితి. ‘వలస కార్మికులను తిరిగి వారి స్వగ్రామాలకు చేర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని మేము కోరడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ సాయం చేయడానికి ముందుకొచ్చింది’ అని వలసకార్మికుల హక్కుల కోసం పనిచేస్తోన్న  మైగ్రెంట్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు ఎం.భీంరెడ్డి తెలిపారు. 

స్వదేశంలో వలస కార్మికుల గతేంటి? 
ఆస్తిపాస్తులు అమ్ముకునో, భార్యమెడలో తాళితాకట్టుపెట్టో విదేశాలకు వెళ్ళి కట్టుబానిసలుగా బతుకుతున్నవారు, రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసినా కనీస జీతాలు దొరక్క బాధపడుతున్నవారు, దీనమైన స్థితిలో స్వదేశాలకు తిరిగొస్తున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గత 25 ఏళ్ళుగా వలస కార్మికులు వివిధ కారణాలతో ఉపాధికోల్పోయి తిరిగి వచ్చేస్తున్నారు. ఇలా వచ్చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయసహకారాలూ అందడం లేదు. వేల సంఖ్యలో వలసవెళ్లి తిరిగొచ్చిన వారి పునరావాసం కోసం ప్రత్యేక విధానమంటూ ప్రభుత్వాలకు లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. 

ఏటా 500 మంది అక్కడే.. 
విదేశాల్లో వివిధ వృత్తుల్లో ఉన్న మన దేశ కార్మికులు పెద్ద మొత్తంలోనే విదేశీ ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. ఒక్క  2017లోనే విదేశాల నుంచి మన దేశానికి 6,900 కోట్ల డాలర్ల విదేశీ ద్రవ్యం వచ్చినట్టు ప్రపంచ బ్యాంక్‌ అంచనా. రెండవ స్థానంలో చైనీయులు 6,400 కోట్ల డాలర్లు విదేశీ ద్రవ్యాన్ని తమ దేశానికి అందించారు. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన వలస కార్మికుల్లో.. ప్రతి ఏటా వివిధ కారణాలతో చనిపోతున్న వారి సంఖ్య 500కు పైనే. వీరికి కనీస ఎక్స్‌గ్రేషియా కూడా అందని స్థితి.  

రిక్తహస్తాలతో తిరుగుముఖం 
గల్ఫ్‌లో కంపెనీ మూసేసేముందు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో ఒట్టిచేతులతో స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. నిజానికి వలస వెళ్ళేటప్పుడు కూలీలుగానే వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఎంతోకొంత నైపుణ్యాన్ని ఒంటబట్టించుకుని వస్తున్నారు. అయినప్పటికీ వారికి తిరిగి ఇక్కడ ఉపాధి దొరకడం లేదు. ఎలక్ట్రీషియన్లుగానో, ప్లంబర్లుగానో వారికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం జరగడంలేదు. 
 
కేసుల్లో ఇరుక్కుంటే! 
గల్ఫ్‌ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అమాయకంగానో, అనవసరంగానో కేసుల్లో ఇరుక్కున్నవారికీ, లేదంటే అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సందర్భంగా మోసపోయిన వారికీ కనీసం అక్కడ లాయర్లను పెట్టుకునే పరిస్థితీ, వారికి ఫీజులు చెల్లించే ఆర్థికస్థితి ఉండదు. ఇండియన్‌ ఎంబసీయే కార్మికుల తరఫున లేబర్‌ కోర్టులో వేతనాల కోసం కేసులు వేస్తుంది. అయితే అన్నీ కోల్పోయిన కార్మికులు అక్కడే ఉండి కోర్టుల్లో న్యాయ పోరాటం చేసే పరిస్థితి ఉండదు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడేవారు చాలామందే ఉన్నారని భీంరెడ్డి వెల్లడించారు. 

కార్మికుల పునరావాసంపై కేరళలో.. 
వలస కార్మికుల పునరావాసంలో కేరళ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేరళ నుంచి అత్యధికంగా 22,00,000 మంది వలస కార్మికులున్నారు. అందులో 90%  మంది గల్ఫ్‌ (జీసీసీ) దేశాలకు వెళ్ళిన వారే. వీరికోసం దేశంలోనే తొలిసారిగా కేరళ ప్రభుత్వం 1996లో ప్రవాస కేరళీయుల వ్యవహారాల శాఖ (నోర్కా)ను ఏర్పాటు చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం పునరావాస చర్యల్లో భాగంగా కేరళ ప్రభుత్వం పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ లాంటి వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకొని వారికి రుణాల రూపేణా ఆర్థిక తోడ్పాటునందిస్తోంది. 15% క్యాపిటల్‌ సబ్సిడీతో 20లక్షల వరకు రుణసాయం అందిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకుగాను నోర్కా నేతృత్వంలో ప్రత్యేక శిక్షణని కూడా ఇస్తున్నారు. 

వలస కార్మికులకు గుర్తింపు కార్డులు 
వలస కార్మికులకు నోర్కా గుర్తింపు కార్డులు ఇస్తోంది. దీని ద్వారా సదరు కార్మికులు ఏఏ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు? అలాగే విదేశాల నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులెందరు? అనే స్పష్టమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. నోర్కా వెబ్‌సైట్‌లో ఈ సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది. ఏయే రంగాల్లో నైపుణ్యం కలిగిన వారు.. ఏయే దేశాల్లో ఎంతమంది ఉన్నారు అనే సమాచారం కూడా వెబ్‌సైట్‌లో ఉంటుంది. విదేశాల్లోగానీ, విదేశాల నుంచి తిరిగి వచ్చాక మన దేశంలోగానీ ఉద్యోగాలు ఆశిస్తున్నవారు సైతం ఈ వెబ్‌సైట్‌లో తమ పేరుని నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే 31,000 మంది ఇందులో రిజిస్టర్‌ చేసుకున్నారు. 

అందుకే అక్కడే చావోరేవో అనే భావనలో.. 
వలస కార్మికుల పునరావాసం, ఉపాధి కోసం దృష్టి సారిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి వారికి అందుతున్న సాయం అంతంతే. ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఉండటంతో ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. చదువుకున్న వారికి సాయం అందుతున్నా వలస కార్మికులకు రుణసాయం లేదా ఆర్థిక సాయం అందుతున్న దాఖలాల్లేవు. దీంతో చావోరేవో అక్కడే ఉండిపోవాలని భావిస్తు్తన్న వలస కార్మికులు వేలల్లో ఉన్నారు. దీంతో వారి కుటుంబాలు చేసిన అప్పులు తీర్చలేక, బతికుండగా తమ వారిని చూసుకోలేక దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న స్థితి రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఉంది. 

మరిన్ని వార్తలు