మా సిఫారసులనే తిరస్కరిస్తారా?

31 May, 2016 02:07 IST|Sakshi
మా సిఫారసులనే తిరస్కరిస్తారా?

కేంద్రానికి ఆ హక్కు ఎక్కడిదన్న సుప్రీంకోర్టు కొలీజియం
- న్యాయ నియామకాల విధివిధానాల సవరణల్లో మార్పులు చేయాలని సూచన
‘ఎంఓపీ’ని కేంద్రానికి తిప్పి పంపిన కొలీజియం
 
 న్యూఢిల్లీ: న్యాయ నియామకాలకు సంబంధించి తాము చేసిన సిఫారసులను జాతీయ ప్రయోజనాల పేరుతో తిరస్కరించటానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని సుప్రీంకోర్టు కొలీజియం ప్రశ్నించింది. సుప్రీంకోర్టుకు, 24 హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మార్గదర్శకం చేసే విధివిధానాల పత్రం (మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ - ఎంఓపీ)ని కేంద్ర ప్రభుత్వం సవరించి పంపించగా.. అందులో కొన్ని నియమాలను మార్చాలని సూచిస్తూ కొలీజియం శనివారం నాడు ప్రభుత్వానికి తిప్పిపంపించింది. దీంతో దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ - న్యాయవ్యవస్థకు మధ్య మరోసారి ఘర్షణ తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఈ ఎంఓపీని పూర్తిగా తిరస్కరించలేదని, కొన్ని మార్పులు మాత్రమే సూచించిందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.

► కొలీజియం చేసిన సిఫారసులను ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల రీత్యా తిరస్కరించవచ్చంటూ కేంద్రం తాజాగా చేసిన సవరణ.. ఆ సిఫారసులను కొలీజియం పునరుద్ఘాటించినట్లయితే ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించేలా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది.
► అలాగే.. కొలీజియం చేసిన ఏదైనా సిఫారసును కేంద్రం ఒకసారి తిరస్కరించినట్లయితే.. కొలీజియం దానిని పునరుద్ఘాటించినప్పటికీ కేంద్రం తప్పనిసరిగా పునఃపరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా తాజా సవరణలో చేర్చటాన్ని కొలీజియం వ్యతిరేకించింది.
► సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, పదోన్నతుల్లో కేంద్రంలో అటార్నీ జనరల్‌కు, రాష్ట్రాల్లో అడ్వొకేట్ జనరళ్ల నిర్ణయానికి చోటుండాలంటూ కేంద్రం చేసిన సవరణపైనా కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల.. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా తమ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని కొలీజియం వ్యాఖ్యానించింది.
► అలాగే.. ప్రస్తుతం ఒక సిఫారసు చేసిన తర్వాత న్యాయమూర్తిని నియమించటానికి దాదాపు మూడు నెలల కాలం పడుతోందని.. ఆ సమయాన్ని తగ్గించేందుకు గల మార్గాలను చూపాలని కూడా కొలీజియం కోరినట్లు సమాచారం.
► కొలీజియం వ్యవస్థను మరింత పారదర్శకంగా చేసేందుకు.. న్యాయ నియామకాలకు సంబంధించిన ఎంఓపీని సమీక్షించి, పునఃలిఖించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. కేంద్రం ఆ మేరకు ఎంఓపీలో సవరణలు సూచించింది. ఇందులో అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి కీలక పాత్ర పోషించారు. దీన్ని న్యాయమంత్రి సదానందగౌడ గత మార్చిలో సీజేఐకి పంపించారు. ఈ సవరణలపై కొలీజియం లేవనెత్తిన అంశాల విషయంలో కేంద్రం అటార్నీ జనరల్ అభిప్రాయం కోరినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు