నీట్‌ రద్దు.. రాజీవ్‌ హంతకుల విడుదల! 

20 Mar, 2019 02:29 IST|Sakshi

తమిళనాట పోటాపోటీగా అన్నాడీఎంకే, డీఎంకే మేనిఫెస్టోలు 

చెన్నై: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులో ప్రధాన పార్టీలైన అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలు మంగళవారం మేనిఫెస్టోలు విడుదల చేశాయి. రెండు వైరి పార్టీల మేనిఫెస్టోల్లోనూ పలు ఉమ్మడి అంశాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఎంబీబీఎస్‌ ప్రవేశపరీక్ష అయిన ‘నీట్‌’ను రద్దుచేసేందుకు కృషిచేస్తామని, అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు తమిళులను విడుదల చేసేలా కేంద్రం, రాష్ట్రపతిపై ఒత్తిడి తెస్తామని ప్రకటించాయి. తమిళనాడులోని మొత్తం 39 సీట్లలో, పుదుచ్చేరిలోని ఒక లోకసభ స్థానానికి ఏప్రిల్‌ 18న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.  

అన్నాడీఎంకే హామీలు
►జాతీయ పేదరిక నిర్మూలన పథకం (ఏఎన్‌పీఈఐ) పేరును ‘అమ్మా జాతీయ పేదరిక నిర్మూలన పథకం (ఏఎన్‌పీఈఐ)’గా పేదలు, వితంతువులు తదితరులకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తాం 
►మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఏడుగురు తమిళులను విడుదల చేసేలా కేంద్రం, రాష్ట్రపతిపై ఒత్తిడి తెస్తాం  
►జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ (నేషనల్‌ ఎంట్రన్స్‌ కమ్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్ష రద్దు
►శ్రీలంకలో తమిళుల ఊచకోత అంశాన్ని ది హేగ్‌లోని ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టుకు తీసుకువెళ్లేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
►నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
►విద్యార్థుల విద్యా రుణాల మాఫీతో పాటు చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
►జస్టిస్‌ సచార్‌ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్రంపై ఒత్తిడి
►దేశంలో తమిళాన్ని అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించేలా చేయడంతోపాటు కావేరీ డెల్టా ప్రాంతాన్ని ప్రొటెక్టడ్‌ అగ్రికల్చర్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
►పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించేలా చేస్తాం
►మత్స్యకారుల సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ ఏర్పాటుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం 

డీఎంకే వరాలు
►రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాలకు నీట్‌ పరీక్ష రద్దు 
►పెద్ద నోట్ల రద్దు బాధితులకు నష్ట పరిహారం (తమిళనాడులో నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ముందు క్యూలో నిలబడి సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు) 
►ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చర్యలు 
►విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాల మాఫీ 
►చిన్న, సన్నకారు రైతుల పంట రుణాల మాఫీ 
►సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల సరఫరా 
►కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 21 శాతానికి తగ్గింపు 
►మైనార్టీ, మహిళలకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు కార్పొరేట్‌ పన్నులో మరింత తగ్గింపు 
►దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల కోటాలోని ప్రయోజనాల కల్పన
►నీతి ఆయోగ్‌ రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని తీసుకురావడం
►రాజ్యాంగ సంస్థల స్వతంత్రను కాపాడటం
►మొత్తం పన్ను వసూల్లో 60 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేసేలా చూడటం
►జీవిత బీమా, విద్యుత్‌ సరఫరాకు జీఎస్టీ మినహాయింపు
►వరికి రూ.2,500, చెరకుకి రూ.4,000 మద్దతు ధర కోసం పోరాడతాం 
►ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ కోసం కృషి
►రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పింఛన్‌ విధానం అమలు
►గ్యాస్‌ సిలిండర్ల ధరల తగ్గింపు
►రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషుల విడుదల  

మరిన్ని వార్తలు