కరోనాపై పోరుకు రిలయన్స్ సిద్ధం..

24 Mar, 2020 11:53 IST|Sakshi

సాక్షి, ముంబై : కరోనాతో పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మేము సైతం అంటూ నడుం బిగించింది. ప్రభుత్వ చర్యలకు తోడు తమ వంతు సాయంగా తోడ్పాటు నందించడానికి ముందుకొచ్చింది. కరోనాపై పోరుకు మాస్కులు అత్యవసరం కావడంతో రోజుకు లక్ష ఫేస్‌మాస్క్‌లు ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ సోమవారం ప్రకటించింది. దీంతోపాటు కరోనా పేషెంట్లను తరలించే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తామని వెల్లడించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత విభాగానికి చెందిన ముంబయి నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో 100 పడకలను సిద్ధం చేశామని రిలయన్స్‌ తెలిపింది. (కరోనా అలర్ట్‌ : నిర్లక్ష్యానికి భారీ మూల్యం)

మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో జీవనాధారం కోల్పోయినవారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని పేర్కొంది. తమ సంస్థలో పనిచేసే ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని స్పష్టంచేసింది. కాగా.. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వాలకు తమవంతుగా సహాయం చేయడానికి వ్యాపార వేత్తలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఆనంద్ మహీంద్రా వెంటిలేటర్ల తయారీ చేపడుతున్నామని, బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు