ఆదర్శ్‌’ కేసులో చవాన్‌కు ఊరట

23 Dec, 2017 03:38 IST|Sakshi

చవాన్‌పై గవర్నర్‌ ఇచ్చిన విచారణ ఉత్తర్వులను రద్దు చేసిన బాంబే హైకోర్టు

ముంబై: 2జీ కేసులో తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీకి మరో కేసులోనూ ఊరట లభించింది. ఆదర్శ్‌ గృహ సముదాయం కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌పై విచారణ జరిపేందుకు ఆరాష్ట్ర గవర్నర్‌ ఇచ్చిన అనుమతిని కొట్టేస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. విచారణలో సాక్ష్యంగా నిలవదగ్గ ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమైందని, అందుకే ఉత్తర్వులను కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. గవర్నర్‌గా శంకర నారాయణ ఉండగానే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అప్పట్లో అనుమతి కోరగా ఆయన తిరస్కరించారు.

ఆ తర్వాత విద్యాసాగర్‌ గవర్నర్‌ అయ్యాక కేసులో తమకు కొన్ని కొత్త ఆధారాలు లభించాయని, చవాన్‌పై విచారణ జరిపేందుకు అనుమతించాలని సీబీఐ కోరడంతో ఆయన 2016లో ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు. దీనిని చవాన్‌ సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘కొత్త ఆధారాలు లభించాయని సీబీఐ చెప్పడంతో పాత గవర్నర్‌ నిర్ణయానికి భిన్నంగా చవాన్‌పై విచారణ జరిపేందుకు ప్రస్తుత గవర్నర్‌ అనుమతించారు. కానీ కోర్టుల్లో విచారణ సమయంలో సాక్ష్యంగా నిలవదగ్గ కొత్త ఆధారాలను సీబీఐ సమర్పించలేక పోయింది. కాబట్టి  గవర్నర్‌ ఉత్తర్వులు చెల్లవు. వాటిని కొట్టేస్తున్నాం’ అని  బెంచ్‌ స్పష్టం చేసింది.  

చవాన్‌పై ఆరోపణలివే
దక్షిణ ముంబైలో రక్షణ శాఖ ఉద్యోగులకు, సైనికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ పథకం. ఆ స్థలంలో ముందుగా అనుకున్న దానికన్నా అదనంగా భవంతులు నిర్మించేందుకు చవాన్‌ అనుమతులిచ్చి అందుకు ప్రతిఫలంగా వాటిలో రెండు ఫ్లాట్లను తమ బంధువులకు బదలాయించారనేది ఆరోపణ. సైనికులకు, రక్షణ శాఖ ఉద్యోగులకు మాత్రమే నిర్మిస్తున్న ఈ సొసైటీలో 40 శాతం ఫ్లాట్లను సాధారణ పౌరులకు కూడా చవాన్‌ (అప్పటికి ఈయన రెవెన్యూ మంత్రి) అక్రమంగా కేటాయించారని ఆరోపణలున్నాయి.

>
మరిన్ని వార్తలు