గుర్తుకొస్తున్నాడా! అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌....

20 Jan, 2018 16:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌.... ఈ పేరును ఎప్పుడో, ఎక్కడో విన్నట్టుగా ఉందే అని ఎక్కువ మందికి అనిపించవచ్చు. సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ అంటే ‘అవును గదా!’ అని కొద్ది మందికి గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్‌ రాష్ట్రంలో పంఖ్తూన్‌ లేదా పఠాన్‌గా పుట్టి జాతిపిత మహాత్మా గాంధీ నిర్దేశించిన అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు మన సరిహద్దు గాంధీ.

ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్‌ కన్నా అహింసా మార్గమే ఆయుధంగా ధరించిన పఠాన్‌ యమ డేంజర్‌ అని బ్రిటీష్‌ పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లో అహింసామార్గాన్ని వీడను. పగ, ప్రతీకారం జోలికి వెళ్లను. నన్ను అణచివేసిన, హింసించిన వ్యక్తులను కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞతతో ‘కుదాయ్‌ కిద్మత్‌ గర్‌’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు సరిహద్దు గాంధీ.

భారత్, పాకిస్థాన్‌ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సరిహద్దు గాంధీ విభజన సందర్భంగా పంఖ్తూన్‌ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లలో ముస్లింల దాడుల నుంచి ఎంతో మంది హిందువులు, సిక్కుల మాన ప్రాణాలను కాపాడారు. ఈ విషయంలో ఆయనకు కుదాయ్‌ కిద్మత్‌ గర్‌ సేన కూడా ఎంతో సహాయపడింది. అల్లర్లను ఆపేందుకు ఆయన మహాత్మాగాంధీతో కలసి బీహార్‌కు వెళ్లి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌ను తగులబెడితే హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరం దగ్ధం అవుతామని హెచ్చరించారు.

అల్లర్లు, హింసతో ఏమీ సాధించలేమని,  అలా సాధించుకున్నది శాశ్వతంగా నిలబడదని కూడా ఆయన ప్రజలకు హితవుచెప్పారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో సంపాదించకున్నది శాశ్వతంగా మిగిలిపోతుందని పిలుపునిచ్చారు. ఇటు బ్రిటీష్‌ ఇండియాలో, అటూ పాకిస్థాన్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన సరిహద్దు గాంధీ అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం గడిపారు. తుది శ్వాస విడిచేంత వరకు నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి జీవించిన గఫర్‌ ఖాన్‌ కన్నుమూసి నేటికి సరిగ్గా 30 ఏళ్లు.

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1988, జనవరి 20వ తేదీన ఆయన మరణించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన ఉట్మంజాయ్‌ నుంచి పెషావర్‌ వెళుతుండగా అరెస్ట్‌ చేశారు. ఇది తెలిసి కుదాయ్‌ కిద్మత్‌ గర్‌ సేన సహా లక్షలాది ప్రజలు పోలీసు స్టేషన్‌ను, పరిసరాలను చుట్టుముట్టారు. వారిపై కాల్పులు జరపాల్సిందిగా బ్రిటీష్‌ అధికారులు ఉత్తర్వులిచ్చినా ‘కాల్పులు జరిపినా ఫర్వాలేదు. ప్రాణాలిస్తాం.’ అంటూ శాంతియుత నినాదాలతో సమన్వయం పాటించిన ప్రజలపై కాల్పులు జరిపేందుకు సైనికులు నిరాకరించారట.

అదే సమయంలో అరెస్టయిన మహాత్మాగాంధీని, ఇతరులను 1931, జనవరి నెలలో విడుదల చేసిన బ్రిటిష్‌ పాలకులు ఖాన్‌ను విడుదల చేయలేదు. చివరకు ఆయన్ని గాంధీయే విడిపించారు. అప్పటికి విడిచిపెట్టిన బ్రిటీష్‌ అధికారులు ఆయన్ని మళీ అరెస్ట్‌ చేసి నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజుల్లో కుదాయ్‌ కిద్మత్‌ గర్‌కు ప్రజల్లో ఎంత ఆదరణ ఉండేదంటే, 1946లో జరిగిన ప్రావిన్షియల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బ్యానర్‌ కింద పోటీ చేసిన కిద్మత్‌ గర్‌ సేనకు 30 సీట్లు రాగా, ముస్లిం లీగ్‌కు కేవలం 17 సీట్లు వచ్చాయి.

అంతకుముందు ఒక్క సీటును కూడా దక్కించుకోని ముస్లిం లీగ్‌ పాకిస్థాన్‌ విభజన తీర్మానం ద్వారా ఆ మాత్రం సీట్లను దక్కించుకుంది. మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఖాన్‌ చివరకు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకే వదిలేశారు. ఆ సమావేశం అత్యధిక మెజారిటీతో దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమావేశంలో గఫర్‌ ఖాన్‌తో పాటు మహాత్మాగాంధీ, రామ్‌ మనోహర్‌ లోహియా, జయప్రకాష్‌ నారాయణ్‌లు పాల్గొనలేదు.

‘మీకు అండగా నిలబడ్డాం. మీతో పాటు పఠాన్లు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చివరకు మీరు మమ్మల్ని నక్కల పాలు చేశారు’ అని సీడబ్ల్యూసీను ఉద్దేశించి ఖాన్‌ వ్యాఖ్యానించారట. ‘పాక్‌లో ఉంటారా, భారత్‌లో ఉంటారా? అని తేల్చుకోమన్నారనే గానీ స్వతంత్య్ర భారతదేశంలో ఉంటారా? అంటూ మాకు మరో ఆప్షన్‌ ఇవ్వలేదు’ అని ఖాన్‌ తన బాధను వ్యక్తం చేస్తూ దేశ విభజన అనంతరం పెషావర్‌కే పరిమితం అయ్యారు. అక్కడి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. 1960వ దశకంలో జైలు నుంచి విడుదలయ్యాక అఫ్ఘాన్‌కు ప్రవాసం వెళ్లారు.

1969లో మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గఫర్‌ ఖాన్‌ భారత్‌కు వచ్చారు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అహ్మదాబాద్‌తోపాటు దేశంలోని పలు చోట్ల హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఆయన సరాసరి అహ్మదాబాద్‌ వెళ్లి అక్కడ అల్లర్లను ఆపేందుకు మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అల్లర్ల అనంతరం హిందూ ప్రాంతాల్లో, హిందువులు, ముస్లిం ప్రాంతాల్లో ముస్లింలు సహాయక చర్యల్లో పాల్గొనడం చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి అంతర్జాతీయ అవగాహన కింద ఇచ్చే ‘జవహర్‌ లాల్‌ నెహ్రూ అవార్డు’ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఈ దేశంలో ఉండాలంటే అంటరాని వారిగా అణగిమణగి ఉండండి లేదా పాకిస్థాన్‌ వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని  ఓ ముస్లిం బాలిక చెప్పడం బాధేసింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ‘మీరు బుద్ధుడిని మరచిపోయినట్లుగానే గాంధీని మరచిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు మరచిపోతున్న మన సరిహద్దు గాంధీని కూడా గుర్తు చేద్దామనే ఈ వార్తా కథనం.
(గమనిక: ‘గఫర్‌ ఖాన్‌: నాన్‌ వాయలెంట్‌ బాద్‌షా ఆఫ్‌ పంఖ్తూన్‌’ పేరిట రాజ్‌మోహన్‌ గాంధీ రాసిన పుస్తకంలో అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం)

మరిన్ని వార్తలు