యూపీలో కొనసాగుతున్న పేర్ల మార్పు ప్రక్రియ

18 Jan, 2019 16:43 IST|Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం పేర్ల మార్పు ప్రక్రియను కొనసాగిస్తోంది. చందౌలీ జిల్లాలోని మొఘల్‌సరాయ్‌ తెహిసిల్‌ పేరును పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ తెహిసిల్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ్‌ సహ వ్యవస్ధాపకులుగా వ్యవహరించారు.

గత ఏడాది ఆగస్ట్‌లో మొఘల్‌సరాయ్‌ జంక్షన్‌ను పండిట్ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద జనసమ్మర్ధ రైల్వేస్టేషన్‌గా పేరొందిన మొఘల్‌సరాయ్‌ రైల్వే స్టేషన్‌ను ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, సీఎం యోగి ఆదిత్యానాథ్‌లు ప్రారంభించారు. కాగా ప్రముఖ నగరాలు, స్టేషన్లు, ఇతర సంస్థల పేర్లను యూపీ ప్రభుత్వం మార్చడం పట్ల రాష్ట్ర మంత్రి ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

స్టేషన్‌ల పేర్లను మార్చినంత మాత్రాన రైళ్లు సకాలంలో రావని, రైల్వేల పనితీరును ప్రభుత్వం మెరుగుపరచాలని ఆయన చురకలు వేశారు. కాగా ఇటీవల యూపీ ప్రభుత్వం చారిత్రక పట్టణం అలహాబాద్‌ పేరును ప్రయాగరాజ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. అలహాబాద్‌కు ఆ పేరును 1575లో మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ ప్రతిపాదించారు.

మరిన్ని వార్తలు