హెకీపై యూజీసీ చైర్మన్‌కు నివేదిక

20 Jul, 2018 02:56 IST|Sakshi

రాష్ట్ర ఎంపీలకు ఉన్నతవిద్యా మండలి నివేదిక కాపీలు అందజేత

సాక్షి, హైదరాబాద్ ‌: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్థానంలో అమల్లోకి తేనున్న హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెకీ)పై రాష్ట్ర అభిప్రాయాన్ని నివేదిక రూపంలో ఉన్నత విద్యా మండలి యూజీసీకి అందజేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరిన నేపథ్యంలో ఈనెల 16న ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని వైస్‌చాన్స్‌లర్లు, విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందరి అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను గురువారం యూజీసీ అధికారులకు ఢిల్లీలో అందజేసింది.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ ఈ నివేదికను అందజేశారు. ప్రతిపాదిత హెకీలో పలు సవరణలు చేయాలన్న అభిప్రాయం వచ్చిందని, రాష్ట్రాల అధికారాలకు కోత పెట్టకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు సవరణల కోసం పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు