మహిళా నేతలకు ఆన్‌లైన్‌ వేధింపులు

24 Jan, 2020 09:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, బ్రిటన్‌లతో పోలిస్తే భారత మహిళా రాజకీయ నేతలే అధికంగా ఆన్‌లైన్‌ వేధింపులు, ట్రోలింగ్‌లకు లక్ష్యంగా మారుతున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ట్విటర్‌లో మహిళా నేతలకు ఎదురైన వేధింపులను పరిశీలించిన క్రమంలో ఈ వివరాలు వెల్లడించాయి. ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్‌ సెక్రటేరియట్‌ 2019 మార్చి-మే మధ్య 95 మంది మహిళా రాజకీయ నేతలకు సంబంధించి వారిని ప్రస్తావిస్తూ సాగిన 1,14.716 ట్వీట్లను విశ్లేషించింది. ఈ ట్వీట్లలో ఏకంగా 13.8 శాతం ట్వీట్లు వేధింపులు, సమస్యాత్మక ధోరణిలో సాగాయని వెల్లడైంది. 2017లో 778 మంది మహిళా జర్నలిస్టులు, రాజకీయ నేతలు రిసీవ్‌ చేసుకున్న లక్షలాది ట్వీట్లను సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎలిమెంట్‌ ఏఐతో కలిసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విశ్లేషించగా మహిళా నేతలకు పంపిన ట్వీట్లలో 7.1 శాతం ట్వీట్లు వారిని లక్ష్యంగా చేసుకుని వేధించేలా ఉన్నాయని గుర్తించారు.

పాశ్చాత్య దేశాల్లో మహిళా నేతలకు ఎదురువుతున్న ట్రోలింగ్‌తో  పోలిస్తే భారత మహిళా నేతలకే ఆన్‌లైన్‌ వేధింపులు, ట్రోలింగ్‌ అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. ఆమ్నెస్టీ నిర్వహించిన ఈ సర్వేలో ట్రోలింగ్‌కు గురైన 95 మంది భారత మహిళా నేతల్లో 44 మంది బీజేపీకి చెందిన వారు కాగా, 28 మంది కాంగ్రెస్‌, 23 మంది ఆప్‌, తృణమూల​ కాంగ్రెస్‌, అప్నాదళ్‌, ఏఐఏడీఎంకే, డీఎంకే వంటి పార్టీలకు చెందిన నేతలున్నారు. అయితే ట్రోలింగ్‌కు గురైన మహిళా నేతల పేర్లను మాత్రం ఆమ్నెస్టీ వెల్లడించలేదు. ఇక మహిళల్లోనూ ముస్లిం మహిళలు మితిమీరిన ట్రోలింగ్‌ను ఎదుర్కోగా, అణగారిన వర్గాలకు చెందిన మహిళలపై వారి కులాన్ని కించపరుస్తూ ట్రోలింగ్‌ సాగినట్టు గుర్తించారు.

పార్టీలకు అతీతంగా మహిళా నేతలను ట్రోల్‌ చేస్తున్నారని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగత విషయాలను సైతం ప్రస్తావిస్తూ ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీకి చెందిన ఓ మహిళా నేత వాపోయారు. తమపై లైంగిక దాడులకు పాల్పడతామని బెదిరించడంతో పాటు తమ ప్రతిష్టను దిగజార్చేలా ట్రోల్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ హసిబా అమిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ అబ్యూజ్‌ను నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని మహిళా నేతలతో పాటు పలువురు కోరుతున్నారు.

చదవండి : విరుష్కలను ఆడేసుకుంటున్న నెటిజన్లు

మరిన్ని వార్తలు