పుల్వామా ఉగ్రదాడి: ఆన్‌లైన్‌లో రసాయనాలు కొని

7 Mar, 2020 11:01 IST|Sakshi

పుల్వామా ఉగ్రదాడి: మరో ఇద్దరి అరెస్టు

శ్రీనగర్‌: గతేడాది 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. జవాన్ల కాన్వాయ్‌ను పేల్చివేసేందుకు ఉపయోగించిన ఐఈడీ తయారీలో కీలకంగా వ్యవహరించిన వాజ్‌-ఉల్‌-ఇస్లాం(19), మహ్మద్‌ అబ్బాస్‌(32)లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బాంబు తయారీ కోసం వీరిద్దరు అమెజాన్‌లో పలు రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. విచారణలో భాగంగా.. జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల సూచనల మేరకు.. తన అమెజాన్‌ షాపింగ్‌ అకౌంట్‌ను ఉపయోగించి వివిధ రసాయనాలు, బ్యాటరీలు, ఇతర పదార్థాలు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు ఇస్లాం అంగీకరించాడని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. పుల్వామా ఉగ్రకుట్రలో భాగంగా ఇస్లామే వీటన్నింటినీ జైషే ఉగ్రవాదులకు వ్యక్తిగతంగా చేరవేశాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే!)

అదే విధంగా పుల్వామా దాడికి ఉపయోగించిన ఐఈడీని తయారు చేసిన మహ్మద్‌ ఉమర్‌కు.. అబ్బాస్‌ 2018 నుంచి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడని తెలిపారు. కొన్నేళ్లుగా రహస్యంగా జైషే కోసం పనిచేస్తున్న అబ్బాస్‌... జవాన్ల వాహనశ్రేణిపై ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్‌ అహ్మద్‌ దార్‌, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన సమీర్‌ అహ్మద్‌ దార్‌, కమ్రాన్‌లకు సహకరించాడని పేర్కొన్నారు. అంతేగాకుండా జైషే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అహ్మద్‌ షా, అతడి కూతురు ఇన్షా జాన్‌కు కూడా సహకారం అందించాడని వెల్లడించారు. త్వరలోనే ఇస్లాం, అబ్బాస్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని తెలిపారు.  కాగా పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ తౌఫిక్‌ అహ్మద్‌ షా, అతడి కూతురు ఇన్షాజాన్‌(23)లు 2018-19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారన్న ఆరోపణలతో ఎన్‌ఐఏ అధికారులు వారిని బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.(‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్‌ )

మరిన్ని వార్తలు