నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌

18 Jul, 2020 10:43 IST|Sakshi

రాంచీ: ప్రతి ఏటా జూలై 16న ‘ప్రపంచ పాముల దినోత్సవం’ జరుగుతుంది. ఈ ఏడాది కూడా పాములకు సంబంధించి పలు అంశాలు, ఫోటోలు, వీడియోలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది. ఈ క్రమంలో జార్ఖండ్‌కు చెందిన ఓ వీడియో తెగ వైరలవ్వడమే కాక నెటిజనుల ఆగ్రహానికి కూడా కారణమవుతోంది. ఈ వీడియోలో జార్ఖండ్‌కు చెందిన పాముల సంరక్షకులు కొందరు ‘వరల్డ్‌ స్నేక్‌ డే’ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పాములతో దాన్ని తినిపించారు. ఈ చర్యల పట్ల నెటిజనుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ జర్నలిస్ట్‌, ఫోటాన్‌ సహ వ్యవస్థాపకుడు విరాట్‌ ఏ సింగ్‌ ఈ వీడియోను షేర్‌ చేయడమే కాక వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ట్యాగ్‌ చేశాడు.
 

‘ఈ వీడియోలోని వారంతా ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి.. పాములతో కూడా తినిపించి ఎంతో ఆనందించారు. వీరంతా పాములను కాపాడే వారు.. కానీ వాటికన్నా వీరే ఎక్కువ ప్రమాదం’ అన్నారు. ఈ వీడియో పట్ల రమేష్‌ పాండే అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ‘సమాజానికి సహజ వనరుల పరిరక్షణకు సంబంధించిన విద్యను బోధించడం ఎంత అవసరమో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతోంది. ప్రకృతి, వన్యప్రాణుల పట్ల ధర్మబద్ధమైన విధానాన్ని ప్రోత్సహించడంలో జూలు, సఫారీలు కీలక పాత్ర పోషిస్తాయని నేను భావిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. మరోక ఐఎఫ్‌ఎస్‌ అధికారి వీరి చర్యలను మూర్ఖపు చేష్టలుగా వర్ణించడమే కాక తక్షణమే వీటికి అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక వీరి గురించి మరిన్ని వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాల్సిందిగా కోరాడు. వీరి గురించి పీసీసీఎఫ్‌(డబ్ల్యూఎల్) జార్ఖండ్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. (పెట్రోల్ పోయ‌లేద‌ని పామును వ‌దిలాడు)

ఇక నెటిజనులు వీరి పనులు మంచివి కావని.. ఈ సంరక్షకుల వల్ల పాములకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. ‘వీరి చర్యలకు బాధ కల్గుతుంది. ఎలా కోప్పడాలో తెలీడం లేదు. ఇప్పటికే నాగుల పంచమి నాడు పాముల చేత బలవంతంగా పాలు తాగిస్తున్నాం. ఇప్పుడు కేక్‌ తినిపిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే త్వరలోనే పాముల్లో కార్బోహైడ్రేట్‌ ఎంజైమ్‌లను అభివృద్ధి చేసే వ్యవస్థ కూడా తయారవుతుంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.

మరిన్ని వార్తలు