అదనపు కలెక్టర్లకు కుల ధ్రువీకరణ బాధ్యత

9 Nov, 2014 23:04 IST|Sakshi

సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశం
* పరిశీలన కమిటీలను రద్దుచేసిన ప్రభుత్వం
* విద్యార్థులు,నిరుద్యోగులకు మేలు చేయనున్న నిర్ణయం
సాక్షి, ముంబై: కులధ్రువీకరణ పత్రాలు పరిశీలించే అధికారం జిల్లా అదనపు కలెక్టర్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. అంతేగాకుండా ఈ పత్రాలు పరిశీలించేందుకు ఇదివరకు నియమించిన కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంవల్ల నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. కులధ్రువీకరణ పత్రాలు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు ప్రజలకు తలనొప్పిగా మారాయి. పరిశీలన కోసం సంబంధిత కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు, కులపత్రాలు యేళ్ల తరబడి అక్కడే పెండింగ్‌లో పడి ఉంటున్నాయి.

చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టు తిరిగినప్పటికీ పనులు కావడం లేదు. సకాలంలో కులధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో నిరుద్యోగులు తమ కోటాలోకి వచ్చే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అనేక సందర్భాలలో ఈ సర్టిఫికెట్ లేకపోవడంవల్ల వచ్చిన ఉద్యోగం చేజారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులకు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అదేవిధంగా విద్యార్థులు పైతరగతుల అడ్మిషన్ల కోసం ఇబ్బందులుపడుతున్నారు. కుల ధ్రువీకర ణ పత్రాలు వెంట లేకపోవడంవల్ల రిజర్వేషన్ కోటాలో సీటు సంపాదించుకోలేకపోతున్నారు. దీంతో విద్యార్థుల భవిత ప్రమాదంలో పడిపోతోంది.

అలాగే పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఫీజుల చెల్లింపులో రాయితీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు మొత్తం చెల్లించి అడ్మిషన్ పొందాల్సి వస్తోంది. ఇలా సామాన్య ప్రజలతోపాటు అనేక మంది విద్యార్థులు  ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల కార్యాలయాల్లోని అదనపు కలెక్టర్లకు వాటిని పరిశీలించే అధికారం ఇవ్వాలని ఫడ్నవిస్ ఆదేశాలు జారీచేశారు. ఇలా చేయడంవల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు