సోష‌ల్ మీడియాలో బిర్యానీ వార్

4 Jul, 2020 19:13 IST|Sakshi

పూణె : హైద‌రాబాద్ బిర్యానీకి ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పనక్క‌ర్లేదు. అయితే పూణెకు చెందిన ప్ర‌ముఖ రెస్టారెంట్ సైతం దీన్నే బిజినెస్ పాల‌సీగా ఎంచుకుంది. త‌మ రెస్టారెంట్‌లో స్వ‌చ్ఛ‌మైన హైద‌రాబాదీ బిర్యానీ ల‌భిస్తుంద‌ని 'ఆన్సియంట్ హైద‌రాబాద్ బిర్యానీ' పేరుతో పూణెలో ఓ రెస్టారెంట్ తెరిచింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా హైద‌రాబాద్ బిర్యానీ త‌ప్ప మిగ‌తా  ఏ బిర్యానీ అయినా అది పులావ్‌తో స‌మానం అంటూ అవుట్‌లెట్ ప్ర‌చురించింది. అంతేకాకుండా ముంబై, పాకిస్తాన్‌లో ల‌భించే బిర్యానీని సైతం అది ఒట్టి మ‌ట‌న్ మ‌సాలా అంటూ వివాదాస్ప‌ద అవుట్‌లెట్‌ని ప్ర‌చురించ‌డంతో సోష‌ల్ మీడియాలో పెద్ద రచ్చ‌కు కార‌ణ‌మైంది. హైద‌రాబాద్ బిర్యానీ ప్రేమికులు దీన్ని స‌పోర్ట్ చేస్తుంటే..ల‌క్నో , కోల్‌క‌తా ప్రాంత వాసులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు త‌మ బిర్యానీకి స‌రైన గుర్తింపు ల‌భించ‌డం లేదంటూ కేర‌ళ వాసులు వాపోయారు.  


అయితే సోష‌ల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న ఈ అవుట్‌లెట్‌పై స్పందించిన య‌జ‌మాని..ఇది కేవ‌లం ఫ‌న్నీగా పెట్టింద‌ని ఇత‌రుల మ‌నోభావాలు, సంస్కృతిని దెబ్బ‌తీయ‌డం త‌మ ఉద్ధేశం కాద‌ని పేర్కొన్నారు. అయితే హైద‌రాబాద్ వంట‌కాల‌ను ఇష్ట‌ప‌డే వారు మాత్రం త‌మ బ్యాన‌ర్‌తో అంగీక‌రించార‌ని తెలిపారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం రెస్టారెంట్ మూసివేశామ‌ని త్వ‌ర‌లోనే తెరిచేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌న్నారు.

మరిన్ని వార్తలు