ఎన్‌ఆర్‌సీలో గల్లంతయిన కార్గిల్‌ వీరుడి పేరు

31 Aug, 2019 19:16 IST|Sakshi

ఆర్మీ రిటైర్డు ఆఫీసర్‌ మహ్మద్‌ సనాఉల్లా ఖాన్‌పేరు గల్లంతు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఎన్‌ఆర్‌సీ నివేదికపై దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. నివేదికలో పలువురు పేర్లు గల్లంతవ్వడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్గిల్‌ యుద్ధంలో భారత ఆర్మీ తరపున పనిచేసిన అర్మీ రిటైర్డు ఆఫీసర్‌ మహ్మద్‌ సనాఉల్లా ఖాన్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఎన్‌ఆర్‌సీ నివేదికలో సనాఉల్లా ఖాన్‌ పేరు లేకపోవడంతో  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నివేదికలో తన పేరు లేకపోవడంపై ఆర్మీ మాజీ అధికారి ఘాటుగా స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న సనాల్లాఖాన్‌, న్యాయం కోసం పోరాడుతానన్నారు. ప్రస్తుతం స్థానికతపై కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకం ఉందన్నారు. జాబితాను రూపొందించిన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం కోసం పోరాటం చేసిన యోధుడు.. సరిహద్దు ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికుడి పేరునే తొలగించారంటే నివేదిక ఎలా రూపొందించారో తెలుస్తోంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు.

మరిన్ని వార్తలు