విద్య కోసం పింఛను విరాళం

2 Dec, 2019 04:49 IST|Sakshi

రూ.97 లక్షలు ఇచ్చిన బెంగాల్‌ రిటైర్డు ప్రొఫెసర్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని విద్యా సంస్థల అభివృద్ధికి గాను ఓ మాజీ మహిళా ప్రొఫెసర్‌ నెలనెలా తనకొచ్చే రూ.50 వేల పెన్షన్‌ను విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. 2002 నుంచి ఇప్పటివరకు రూ.97 లక్షలు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విరాళమిచ్చినట్లు మాజీ ప్రొఫెసర్‌ చిత్రలేఖ మల్లిక్‌ వెల్లడించారు. కోల్‌కతాలోని బాగుతి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. విక్టోరియా ఇన్‌స్టిట్యూట్‌లో సంస్కృతం ప్రొఫెసర్‌గా ఆమె పనిచేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిశోధనలు చేస్తున్న వారికి ఆర్థిక సాయం అందించేందుకే ఇలా విరాళమిస్తున్నట్లు తెలిపారు.

తనకు నెలకు పింఛన్‌ కింద రూ.50 వేలు వస్తున్నాయని, ప్రొఫెసర్‌గా పనిచేసిన జాదవ్‌పూర్‌ యూనివర్సిటీకి రూ.50 లక్షలు విరాళమిచ్చినట్లు పేర్కొన్నారు. తన పరిశోధనలకు మార్గనిర్దేశకత్వం చేసిన పండిట్‌ బిధుభూశణ్‌ భట్టాచార్య జ్ఞాపకార్థం గతేడాది రూ.50 లక్షలను వర్సిటీకి అందజేసినట్లు తెలిపారు. మొదటిసారిగా 2002లో తన పింఛన్‌ రూ.50 వేలను విక్టోరియా ఇన్‌స్టిట్యూట్‌ మౌలిక వసతుల కోసం విరాళమిచ్చినట్లు చెప్పారు. అలాగే హౌరాలోని ఇండియన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడిసిన్‌కు రూ.31 లక్షలు విరాళం ఇచ్చానని అన్నారు.

మరిన్ని వార్తలు