బొగ్గు, ఉప్పు పోయి ఆవాలు, పూదీన వచ్చే!

5 Jan, 2018 18:36 IST|Sakshi

దంత సంరక్షణలో సరికొత్త విప్లవం

సాక్షి, న్యూఢిల్లీ : తళతళలాడే దంతాల కోసం తాపత్రయ పడే ప్రజలు మొన్న బొగ్గు, నిన్న ఉప్పు, నేడు ఆవాలు, పూదీన, ఆఖరికి పసుపుతో కూడిన మంజన్లు, పేస్టులు వాడుతున్నారు. భారత్‌లో ఈ విప్లవానికి శ్రీకారం చుట్టి దంత సంరక్షణ మార్కెట్‌ను మరెక్కడికో తీసుకెళుతన్నది నిస్సందేహంగా బాబా రామ్‌దేవ్‌ నాయకత్వంలోని పతంజలి ఉత్పత్తులే. సంప్రదాయబద్ధంగా ఆయుర్వేదం లేదా ఔషధ మూలికల మూలాలు కలిగిన ఉత్పత్తులతో ముందుకు వస్తున్న పతంజలి ఉత్పత్తులు మార్కెట్‌లో మరెంతో ముందుకు దూసుకెళుతున్నాయి. 

ఒక్క భారత్‌లోనే పదివేల కోట్ల రూపాయల మార్కెట్‌ కలిగిన దంత సంరక్షణ రంగంలో బాబా రామ్‌దేవ్‌ ప్రధాన వాటా కోసం పోటీ పడుతున్నారు. ఆయన పోటీని తట్టుకొని తమ ఉత్పత్తులను నిలబెట్టుకోవడానికి కాల్గేట్, హిందుస్థాన్‌ యూనిలివర్‌ లాంటి సంస్థలు కూడా పంతంజలి బాటను పట్టక తప్పలేదు. ‘మీరు వాడే కాల్గేట్‌లో ఉప్పు ఉందా?’ అంటూ ఈ దిశగా ముందుకొచ్చిన కాల్గేట్‌ ‘సిబాకా వేదశక్తి’ని 2016, ఆగస్టులో మార్కెట్‌లోని విడుదల చేసింది. ఇక హిందుస్థాన్‌ యూనిలివర్‌ కంపెనీ ఆవాలు, రాతి ఉప్పు మూలాలు కలిగిన ‘ఆయుష్‌’ బ్రాండ్‌ను 2017, ఆగస్టులో విడుదల చేసింది. 

అయినప్పటికీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఔషధ మూలికల దంత ఉత్పత్తుల్లో అమ్ముడుపోతున్న ఐదింటిలో నాలుగు బ్రాండ్లు పతంజలి, డాబర్‌ ఉత్పత్తులే కావడం విశేషం.

‘హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌’ లెక్కల ప్రకారం దేశంలో దంత సంరక్షణ మార్కెట్‌ పదివేల కోట్ల రూపాయలకు విస్తరించగా, 10 సంవత్సరాల క్రితం వీటిల్లో ఆయుర్వేద లేదా ఔషధ మూలికల బ్రాండ్లు ఒక్కటైనను లేదు. నేడు వాటి వాటా పదివేల కోట్ల రూపాయల్లో 20 శాతానికి చేరుకొంది. భారత దేశంలో నేడు 90 శాతం ఇళ్లలో టూత్‌పేస్ట్‌ లేదా టూత్‌ పౌడర్‌ వాడుతున్నారు. వీటిల్లోకి ఔషధ మూలాలున్న ఉత్పత్తులు చొచ్చుకుపోవడానికి కారణం ఆరోగ్యానికి అవి మంచి చేస్తాయన్న విశ్వాసమే కాకుండా ధర తక్కువగా ఉండడం కూడా మరో కారణం. పతంజలి ఉత్పత్తులో దంత్‌ కాంతి బ్రాండ్‌ను ప్రతి వంద గ్రాములను 40 రూపాయలకు విక్రయిస్తుండగా, కాల్గేట్, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ ఉత్పత్తులను ప్రతి వంద గ్రాములను 55 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. 

అయినప్పటికీ ఇప్పటికీ మార్కెట్‌ లీడర్‌ కాల్గేట్‌ కంపెనీయే. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2015 సంవత్సరంలో మార్కెట్‌లో కాల్గేట్‌ వాటా 57 శాతం నుంచి 53 శాతానికి పడిపోయింది. ప్రజలు కాస్మోటిక్‌ కేర్‌ నుంచి థెరపాటిక్‌ కేర్‌కు, అంటే సౌందర్య పిపాస నుంచి ఆరోగ్య సంరక్షణకు మల్లడం వల్ల మూలికల మూలాలున్న ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని డాబర్‌ ఇండియా సీఈవో సునీల్‌ దుగ్గల్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లో డాబర్‌ ఇండియా రెడ్, బాబుల్, మెశ్వాక్‌ బ్రాండ్ల టూత్‌పేస్ట్‌ను విక్రయిస్తున్న విషయం తెల్సిందే. 

మరిన్ని వార్తలు