'బాద్షా మిస్సింగ్.. జాడ చెబితే 50 వేలు'

13 Apr, 2016 15:35 IST|Sakshi
'బాద్షా మిస్సింగ్.. జాడ చెబితే 50 వేలు'

వారణాసి: కొందరు బంధుత్వాలకు బానిసలు. ఆ బంధుత్వాలు మనుషులతో బలహీనంగా ఉంటాయేమోగానీ, మూగజీవాలతో అయితే మాత్రం చాలా గాఢంగా ఉంటాయి. ఎందుకంటే తమకు ఇష్టమైన మూగజీవం కనిపించడం లేదని రోజుల తరబడి తిండితిప్పలు మానేసిన సందర్భాలు కోకొల్లలు. వాటికోసం కాలం చేసినవారు లేకపోలేరు. అంత గాఢంగా మూగజీవాలతో అనుబంధం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని జరిగిన ఈ ఘటన కూడా మూగజీవాలకు మనుషులకు మధ్య ఉన్న ప్రేమ ఏమిటో తెలియజేస్తుంది.

తప్పిపోయిన తన ఎద్దును గుర్తించి తిరిగి తమకు అప్పగించిన వారికి రూ.50 వేలు రివార్డును ప్రకటించాడు వారణాసికి చెందిన ఓ వ్యక్తి. వారం రోజులపాటు దానికోసం చెప్పులు అరిగేలా తిరిగి ఆచూకీ కనిపించకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ఆ ఎద్దు పోస్టర్లను పలు ప్రాంతాల్లో గోడలకు అంటించి దానిని గుర్తించినవారికి రూ.50 వేలు పారితోషికం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. అయితే, కేసును మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న పోలీసులు ఏ మాత్రం ముందడుగు వేయలేదు. కానీ, సమాజ్వాది పార్టీ నేత అజాంఖాన్ బర్రెలు పోయినప్పుడు మాత్రం మొత్తం సీనియర్ పోలీసు పటాలమంతా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.


సారనాథ్కు చెందిన మనోజ్ కుమార్ పాండే అని వ్యక్తికి ఒక మూడేళ్ల ఎద్దు ఉంది. అది కొంచెం నలుపు, తెలుపు ఎరుపుతో ఉంది. అదంటే అతడికి ఎంతో ప్రేమ కావడంతో చాలా బాగా చూసుకున్నాడు. దీంతో అది చాలా బలిష్టంగా ఆకట్టుకునేలా తయారైంది. దానికి అతడు ముద్దుగా 'బాద్ షా' అని పేరు కూడా పెట్టుకున్నాడు. వారం రోజుల కిందట తన బాద్షా కనిపించకుండా పోయాడు.

దీంతో తొలుత తనకు పరిచయం ఉన్న అన్ని చోట్లలో వెతికిన పాండే చివరకు పోలీసులను ఆశ్రయించి రివార్డు కూడా ఇస్తానని ప్రకటన చేశాడు. మరో విచిత్రం ఏమిటంటే వారు భోజనం చేసే ముందు ఆ ఎద్దు కిచెన్కు వస్తుందట. తను నిద్రపోయే సమయంలో బెడ్ రూంలోకి వచ్చి పడుకుంటుందని, తన దృష్టిలో అది కేవలం ఎద్దు మాత్రమే కాదని, తమ కుటుంబ సభ్యుడు అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు