అజిత్‌ జోగి కోడలి విజయం ఖాయం

20 Nov, 2018 13:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కోడలు రిచా జోగి విజయం సాధించడం నల్లేరు మీద నడకేనని అకల్తారా అసెంబ్లీ నియోజక వర్గం  ప్రజలు భావిస్తున్నారు. అజిత్‌ జోగి కాంగ్రెస్‌ పార్టీ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఈసారి ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. ఈ కారణంగా ఆయన తన కోడలును బీఎస్‌పీ తరఫున ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో 45 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉండడమే కాకుండా బీఎస్పీకీ మంచి ప్రాబల్యం ఉండడమే అందుకు కారణం కావచ్చు. 

జాంజ్‌గిర్‌–చంపా జిల్లాలోని అకల్తారా నియోజక వర్గంలో 35 దళిత, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వారంత ఈసారి అజిత్‌ జోగికే ఓటు వేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారట. ఆ గ్రామాల గ్రామాల ప్రజలు రిచా జోగి ప్రత్యర్థులెవరిని తమ గ్రామాల్లో ప్రచారానికి అనుమతించడం లేదు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత కాంగ్రెస్‌ శాసన సభ్యుడు చున్నీలాల్‌ సాహు ఐదేళ్ల నుంచి తమ గ్రామాలకే రావడం లేదని, అక్కడక్కడ ఆయన పోస్టర్లు తప్ప ఆయన జాడ కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. అకల్తార పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఓ టాయ్‌లెట్‌ నిర్మంచమంటే కూడా  ఆయన నిర్మించలేక పోయారని, అలాంటి వ్యక్తికి ఈసారి ఓటు ఎలా వేయగలమని చెబుతున్నారు. 

నియోజకవర్గంలోని ముర్లిది గ్రామంలో 1800 మంది ఓటర్ల ఉండగా 1600 మంది ఓటర్లు రిచా జోగికే ఓటు వేస్తున్నట్లు చెప్పారు. మిగతా 200 మంది ఓటర్లు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సౌరభ్‌ సింగ్‌కు ఓటు వేస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీకి మధ్యనే పోటీ ఉంటుందని, అయితే రిచా జోగిదే విజయమని చెబుతున్నారు. అకల్తారాలో మెజారిటీ ఇళ్లపై బీఎస్పీ జెండాలే కనిపిస్తోంది. ఆఖరికి చున్నీలాల్‌ సాహుకు మద్దతిస్తున్న కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ పుణేశ్వర్‌ కుమార్‌ ఆనంద్‌ ఇంటిపై కూడా బీఎస్పీ జెండా ఎగరడం అందుకు నిదర్శనం. ఈ విషయమై ఆయన్నే ప్రశ్నించగా తన 10, 12 ఏళ్ల కొడుకులు తెలియక ఆ జెండాను ఎగరేశారని చెప్పుకున్నారు. 

మరిన్ని వార్తలు