ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కు కాదు

7 Feb, 2020 04:02 IST|Sakshi

రాజ్యసభలో కేంద్ర మంత్రి రవిశంకర్

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ సౌకర్యం ప్రాథమిక హక్కు అనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇంటర్నెట్‌ హక్కుతోపాటు దేశ భద్రతా చాలా ముఖ్యమైన విషయమేనని గుర్తించాలంది. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, న్యాయశాఖల మంత్రి రవిశంకర్‌ గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్‌ ద్వారా భావాలు, అభిప్రాయాలను తెలుసుకోవడం భావవ్యక్తీకరణ హక్కులో ఒక భాగం. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

కశ్మీర్‌లో హింస, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పాక్‌ ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన.. ఇంటర్నెట్‌తోపాటు దేశ భద్రత ముఖ్యమైందేనని అందరూ గుర్తించాలన్నారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి..‘కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన మీరు ఉగ్రవాదుల హిట్‌ లిస్టులో ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ దుర్వినియోగం అవుతోందని మీకూ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలను సమీక్షించి సడలించేందుకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు. కశ్మీర్‌లో, లడాఖ్‌ల్లో ప్రభుత్వం, బ్యాంకింగ్, పర్యాటకం, ఈ కామర్స్, రవాణా, విద్య తదితర రంగాలకు సంబంధించిన 783 వెబ్‌సైట్లపై ఎటువంటి నియంత్రణలు లేవన్నారు.

‘నెట్‌’దుర్వినియోగానికి ఆయా సంస్థలదే బాధ్యత
ఇతరుల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా అశ్లీల వీడియాలు, చిత్రాలను ఉంచడం, పుకార్లు వ్యాపింప జేయడం, హింసను ప్రేరేపించడం వంటి వాటికి యూట్యూబ్, గూగుల్, వాట్సాప్‌ తదితర సామాజిక వేదికలను వాడుకోవడం ఆందోళన కలిగిస్తోందని రవిశంకర్‌ అన్నారు. ఇందుకు గాను ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌కు సంబంధించి.. అందులోని సమాచారం మూలాలను తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యూట్యూట్‌లో ఇతరులపై కక్ష తీర్చుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఉంచే అశ్లీల చిత్రాలు, వీడియోలకు సంబంధించి ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు