సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రిషికుమార్‌ శుక్లా

2 Feb, 2019 17:34 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషికుమార్‌ శుక్లా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిషికుమార్‌ శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేస్తున్నారు. రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌ పదవిలో ఆయన కొనసాగనున్నారు. తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్‌. నాగేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. (అలోక్‌ వర్మపై అన్ని నిరాధార ఆరోపణలే!)

విపక్ష కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిషికుమార్‌ను సీబీఐ బాస్‌గా ప్రభుత్వం నియమించింది. శుక్రవారం మోదీ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు సీజే రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిషికుమార్‌ పేరును ఖర్గే వ్యతిరేకించారు. అయితే ప్రధాని, సీజేఐ ఆమోదంతో 2-1 మెజారిటీతో రిషికుమార్‌ను సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. గత నెల 24న ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ మొదటి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. దీంతో రెండో సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

అంతకుముందు సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌ ఆస్థానాతో విభేదాల కారణంగా అలోక్‌ వర్మ పదవి కోల్పోయారు. (అలోక్‌ వర్మ ఉద్వాసనలో అసలు ప్రశ్న!)

మరిన్ని వార్తలు