అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్‌?

14 Jul, 2019 18:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్ధరాత్రి ఇంటికి వస్తున్న ఓ రేడియో జాకీని తను నివాసం ఉండే కాలనీ సెక్యూరిటీగార్డు వేధింపులకు గురిచేసిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది.  అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావని వెటకారంగా ఆమెను ప్రశ్నించడమేగాక కాలనీ గేటు తీయడానికి నిరాకరించాడు. సెక్యూరిటీగార్డు చేష్టలతో ఖంగుతిన్నఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ కాలనీ అధ్యక్షుడు, అతని భార్య సైతం సెక్యూరిటీ గార్డునే వెనకేసుకొచ్చారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడమేగాక తన ఆవేదనను ట్విటర్‌లో పంచుకుంది. 

ఆఫీసులో పని ఎక్కువ కావడంతో ఆలస్యంగా వచ్చిన రేడియోజాకీ స్తుతీ ఘోష్‌ను కాలనీ సెక్యూరిటీ గార్డు అడ్డగించాడు. ఇంత అర్ధరాత్రి వరకూ ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. కాలనీలోకి రాకుండా గేటును మూసివేశాడు. స్తుతీ సెక్యూరిటీగార్డుని మందలించేలోగా ఆ కాలనీ అధ్యక్షుడు మిక్కీ బేడీ జోక్యం చేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డును ఏమీ అనకుండా తిరిగి స్తుతీపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె క్యారెక్టర్‌ను అనుమానించేలా.. ఎందుకు నువ్వు లేట్‌గా వస్తున్నావ్‌, ఎక్కడి నుంచి వస్తున్నావ్‌ అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా కాలనీ అధ్యక్షుని భార్య కూడా అతన్నే వెనకేసుకొచ్చింది. సాటి మహిళ అని చూడకుండా స్తుతీపై గట్టిగా అరుస్తూ కాలనీ గేటు తెరవొద్దని సెక్యూరిటీకి చెప్పింది. దీంతో స్తుతీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. స్తుతీ తల్లి మాట్లాడుతూ వృత్తిలో భాగంగా తన కూతురు ఒక్కోసారి లేట్‌గా వస్తుందని, వీళ్లెవరు తనని ప్రశ్నించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలనీ అధ్యక్షుడిగా ఇంత సంకుచిత భావాలు ఉన్న వ్యక్తిని ఎలా ఎంపిక చేశారని మండిపడింది. స్తుతీ ఘోష్‌కు మద్దతు తెలుపుతూ అనేకమంది ట్విటర్లో తమ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి వాళ్ల వల్లే  స్త్రీ స్వాతంత్రం భారత్‌కు రావట్లేదని విమర్శించారు. 

మరిన్ని వార్తలు