‘చిన్నారుల మరణానికి బాధ్యత సీఎందే’

30 Jun, 2019 19:41 IST|Sakshi

పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో 150 మందికి పైగా చిన్నారుల మరణానికి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ బాధ్యత వహించాలని ఆర్‌ఎల్‌ఎస్‌పీ చీఫ్‌, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వహ ఆరోపించారు. బిహార్‌ను కాపాడేందుకు నితీష్‌ కుమార్‌ను సీఎం పీఠం నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. నితీష్‌ వైఫల్యాలను వెల్లడిస్తూ తాను జులై 2 నుంచి 6 వరకూ ప్రజల మద్దతు కోరుతూ ప్రదర్శన చేపడతానని వెల్లడించారు.

బిహార్‌లో జేడీ(యూ) నేతృత్వంలోని ప్రభుత్వంలో గతంలో భాగస్వామిగా ఉన్న కుష్వహ ప్రజల్లో పార్టీ కోల్పోయిన పట్టును పెంచుకునేందుకు చిన్నారుల మరణాలను హైలైట్‌ చేస్తూ ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆర్‌ల్‌ఎస్‌పీ వర్గాలు పేర్కొన్నాయి. నితీష్‌ కుమార్‌ గత 14 ఏళ్ల తన పాలనలో మెదడువాపు వ్యాధిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. నితీష్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించేవరకూ తన నిరసన కొనసాగుతుందని కుష్వహ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు