వృద్ధురాలిపై మీకు ఎందుకింత కక్ష.. ?

12 Feb, 2019 16:02 IST|Sakshi

జైపూర్‌ : లండన్‌లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాపై ఈడీ విచారణ కొనసాగుతోంది. మంగళవారం జైపూర్‌లో రాబార్‌​‍్ట వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్‌ వాద్రాను కూడా ఈడీ విచారిస్తోంది. ఈ సందర్భంగా భర్త, అత్తతో పాటుగా ప్రియాంక గాంధీ జైపూర్‌ చేరుకున్నారు.

ఈ క్రమంలో తన తల్లిని కూడా ఈడీ విచారించడంపై వాద్రా తీవ్రంగా స్పందించారు. తన భార్య ప్రియాంక రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘నాతో పాటు, 75 ఏళ్ల మా అమ్మ కూడా ఈరోజు జైపూర్‌లో ఈడీ ఎదుట హాజరయ్యారు. కారు ప్రమాదంలో కూతురిని, డయాబెటిస్‌ కారణంగా ఎదుగుతున్న కొడుకుని, అదే విధంగా భర్తను పోగొట్టుకున్న ఓ వృద్ధురాలి పట్ల ఈ ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా, దిగజారుడు చర్యలకు పాల్పడుతుందో అర్థం కావడం లేదు. ఆ మూడు మరణాల కారణంగానే నాతో కలిసి ఆఫీసుకు రావాలని అమ్మను కోరాను. అక్కడ నాతో పాటే ఉంటే తనను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవచ్చని భావించాను. ఆ సమయంలో మా జీవితంలో చోటుచేసుకున్న విషాదం గురించి దుఃఖిస్తూ బాధను కాస్త తగ్గించుకునే వాళ్లం. ఈరోజు తను కూడా ఈడీ ముందుకు రావాల్సి వచ్చింది. అయినా దేవుడు మాతో ఉన్నాడు’ అంటూ రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్టును ఉంచారు.(రాబర్ట్‌ వాద్రా స్కామ్‌ ఏమిటీ ?)

కాగా మనీల్యాండరింగ్‌ కేసులో వాద్రాను ఈనెల 6, 7, 10 తేదీల్లో విచారించిన ఈడీ మంగళవారం మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. వాద్రా లండన్‌లో వరుసగా 5 మిలియన్‌ పౌండ్లు, 4 మిలియన్‌ పౌండ్ల విలువ చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్‌, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు