మళ్లీ ఈడీ ముందుకు వాద్రా

8 Feb, 2019 04:52 IST|Sakshi

మనీల్యాండరింగ్‌ కేసులో రెండోరోజూ హాజరు

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ బావ రాబర్ట్‌ వాద్రా వరుసగా రెండో రోజు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారులు వాద్రాను దాదాపు  9 గంటలకుపైగా ప్రశ్నించారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో బుధవారం వాద్రా ఇచ్చిన సమాధానాలపై సంతృప్తిచెందకపోవడంతో రెండు రోజు విచారణకు పిలిచింది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదుచేశారు. బికనీర్‌ భూకుంభకోణానికి సంబంధించి మరో మనీ ల్యాండరింగ్‌ కేసులో వాద్రా ఈ నెల 12న జైపూర్‌లో మళ్లీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

మరో కేసులో కార్తీ చిదంబరం
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా గురువారం ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేరోజు విచారణకు రావడంతో ఢిల్లీలోని జామ్‌నగర్‌ హౌజ్‌ ఈడీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆ ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను నియంత్రించడానికి బారికేడ్లు ఏర్పాటుచేశారు.  ఉదయం 11 గంటలకు కార్తీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా, 11.25 గంటలకు వాద్రా వచ్చారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకే సంబంధించి పి.చిదంబరంను శుక్రవారం విచారించే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

మాల్యాతో తల్వార్‌కు సంబంధాలు: ఈడీ
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాతో కార్పొరేట్‌ మధ్యవర్తి దీపక్‌ తల్వార్‌కు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. విదేశాల్లో ఉన్న తల్వార్‌ కొడుకు ఫిబ్రవరి 11న తమ ముందు విచారణకు హాజరవుతున్నారని, ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని వెల్లడించింది. తల్వార్‌ కస్టడీని వారం పాటు పొడిగించాలని కోరగా కోర్టు ఫిబ్రవరి 12 వరకు అనుమతిచ్చింది.

మరిన్ని వార్తలు