మావోల పేలుళ్లకు రోబోతో చెక్‌!

6 Jun, 2017 01:55 IST|Sakshi
మావోల పేలుళ్లకు రోబోతో చెక్‌!

- మందుపాతర్ల గుర్తింపు, నిర్వీర్యానికి ప్రత్యేక రోబోలు
- ఆర్మీ ఉపయోగిస్తున్న దక్ష్‌ను తలదన్నే రీతిలో సీఆర్పీఎఫ్‌ కోసం తయారీ
- 10 అడుగుల దూరం నుంచే ల్యాండ్‌మైన్లను గుర్తించే పరిజ్ఞానం
- ఐఐటీ ముంబై నేతృత్వంలో రూపకల్పన
- రోడ్‌ ఓపెనింగ్‌ బృందాలకు సాయంగా ఫోర్‌ వీలర్‌ రోబోలు కూడా...
- ల్యాండ్‌మైన్‌లను గుర్తించే బూట్లనూ సిద్ధం చేస్తున్న సీఆర్పీఎఫ్‌


సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పారామిలిటరీ (సీఆర్పీఎఫ్‌) బలగాలపై మావోయిస్టులు మందుపాతరలు, అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ)తో జరుపుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దూరం నుంచే రిమోట్ల సాయంతో పేలుళ్లు జరుపుతున్న మావోయిస్టులకు అదే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పేలుళ్లను అరికట్టేందుకు సిద్ధమవుతోంది. మావోయిస్టుల చర్యలను తిప్పికొట్టేందుకు రోబోలను రంగంలోకి దించనుంది. ఐఐటీ ముంబై నేతృత్వంలో వీటిని తయారు చేయనుంది.

ఎలా పనిచేస్తాయంటే...
ఏడు అడుగుల ఎత్తు ఉండే ఈ రోబోలు... మందుపాతరలు, అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ)ను 10 అడుగుల దూరం నుంచే సెన్సార్ల సాయంతో గుర్తించి నిర్వీర్యం చేయగలవు. హై రిజల్యూషన్‌ కెమెరాల ద్వారా ఐఈడీ, ల్యాండ్‌మైన్లను స్కాన్‌ చేసి వాటి తీవ్రతను కూడా పక్కాగా చెప్పగలిగేలా వ్యవస్థను ఈ రోబోలలో ఏర్పాటు చేస్తున్నారు. మందుపాతరలకు 100 నుంచి 200 మీటర్ల దూరంలో నిలబడే సీఆర్పీఎఫ్‌ బలగాలు ఈ రోబోలను పనిచేయించేలా మినీ కంప్యూటర్లను తయారు చేస్తున్నారు. ఈ రోబోలను ఆపరేట్‌ చేసేందుకు కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు.

రోబోల అవసరం ఏమిటి?
మావోయిస్టుల కంచుకోటగా మారిన ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్‌కు గత కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టులు పేలుస్తున్న ల్యాండ్‌మైన్లకు భారీ స్థాయిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృత్యువాత పడుతున్నారు. 2015లో 49 మంది, 2016లో 64 మంది జవాన్లు ల్యాండ్‌మైన్‌ పేలుళ్లలో మరణించారు. దీనివల్ల కూంబింగ్‌ చేస్తున్న మిగతా జవాన్లలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ప్రాణ భయం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ రోబోలను రంగంలోకి తెస్తోంది. ఒకవైపు కూంబింగ్‌ నిర్వహిస్తూనే మరోవైపు ల్యాండ్‌మైన్లకు జవాన్లు బలికాకుండా రోబోలను ముందుపెట్టి కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో 92 వేల మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు పనిచేస్తున్నారు.

దక్ష్‌ను తలదన్నే రీతిలో...
ఉగ్ర దాడుల నియంత్రణకు సైన్యం ప్రస్తుతం ఉపయోగిస్తున్న దక్ష్‌ రోబోలకు దీటుగా ఈ రోబోలను రూపొందిస్తున్నారు. ఆర్మీ కోసం డీఆర్‌డీఓ నేతృత్వంలో దక్ష్‌ సిరిస్‌ రోబోలను రంగంలోకి దించారు. అత్యాధునిక టెలిస్కోప్, హై రిజల్యూషన్‌ కెమెరాలతో అనుమానిత పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేయడం, మెట్లు ఎక్కగలగడంతోపాటు ఎగుడుదిగుడు నేలలు, ఇరుకైన ప్రదేశాల్లో పనిచేసేలా దక్ష్‌ రోబోలను రూపొందించారు. దక్ష్‌ రోబోలను 200 మీటర్ల దూరం నుంచి కంప్యూటర్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్ష్‌  రోబోలకన్నా మరింత మెరుగ్గా పనిచేసేలా ఏడడుగుల రోబోలను తయారు చేస్తున్నారు.

ఎక్కడ వాడతారంటే...
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రెడ్‌ జోన్‌ (ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బస్తర్, ఒడిశాలోని మల్కాన్‌గిరి, ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, బిహార్‌) పరిధిలో రోబోలను ఉపయోగించాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. కూంబింగ్‌కు వెళ్లే సీఆర్పీఎఫ్‌ బలగాలకు సహకరిస్తూనే రోబోలు కార్యకలాపాలు చేపట్టనున్నాయి.

పెట్రోలింగ్‌ కోసం ఫోర్‌ వీలర్‌ రోబోలు...
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వ్యవస్థను పటిష్టం చేస్తూ వారి కార్యకలాపాలకు చెక్‌పెట్టేందుకు రోబోలతో కూడిన ఫోర్‌ వీలర్లను కూడా రూపొందించే పనిలో ఉన్నట్లు సీనియర్‌ ఐపీఎస్‌ ఒకరు తెలిపారు. ఈ రోబోలు రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీలకు అనుసంధానంగా పనిచేస్తాయన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, సుక్మా, మహారాష్ట్రలోని దంతెవాడ, ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతాల్లో రోడ్లపై మావోయిస్టులు అమర్చే బాంబులను 15 అడుగుల దూరం నుంచే గుర్తించి క్యాంపు కంట్రోల్‌ సెంటర్‌ను అప్రమత్తం చేయడం, తర్వాత కూంబింగ్‌లో ఉండే రోబోల సాయంతో ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ రెండు రకాల రోబోలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు.

సెన్సార్ల బూట్లు...హైదరాబాద్‌ క్యాంపులో ప్రయోగం
అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌కు వెళ్లే జవాన్లకు అత్యాధునిక బూట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఆర్పీఎఫ్‌ అధికారులు తెలిపారు. ల్యాండ్‌మైన్లను గుర్తించలేక వాటిని తొక్కడం వల్ల అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి ల్యాండ్‌మైన్లను గుర్తించేలా జవాన్ల బూట్లకు ప్రత్యేక సెన్సార్లు అమర్చే పనిలో ఉన్నామని సీఆర్పీఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం వీటిని హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్‌ క్యాంపులో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు