ఎట్టకేలకు ఇండియా 'బిన్‌ లాడెన్‌' పట్టివేత

12 Nov, 2019 17:29 IST|Sakshi

గౌహతి: వేలాది మంది ప్రాణాలు తీసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అసోంలోని ‘ఒసామా బిన్‌ లాడెన్‌’ను కూడా ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. అసోంలో లాడెన్‌ ఏంటి అనుకుంటున్నారా?.. గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు తీసుకున్న ఓ ఏనుగుకు అక్కడి ప్రజలు 'ఒసామా బిన్ లాడెన్' అని పేరు పెట్టారు. గత అక్టోబర్‌లో అసోంలోని గోల్పారా జిల్లాలో ఈ ఏనుగు ఐదుగురు గ్రామస్తులను చంపింది. ఈ ‘లాడెన్’ను పట్టుకునేందుకు అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్‌  చేపట్టారు. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో ఎట్టకేలకు ఈ ఏనుగు పట్టుబడిందని అసోం జిల్లా ఉన్నతాధికారులు తాజాగా తెలిపారు.

దీనిని పట్టుకోవడానికి డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి చాలా రోజుల పాటు అడవిలో అటవీశాఖ అధికారులు ట్రాక్ చేశారు. నిపుణులైన షూటర్లు, బాణాలతో మత్తు మందిచ్చి పట్టుకున్నామని అటవీశాఖ అధికారి తెలిపారు.

ఇప్పుడు ‘లాడెన్‌’ ఏనుగును సమీపంలో మానవ నివాసాలు లేని అడవికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ నెలలో 24గంటల వ్యవధిలో లాడెన్‌ ఏనుగు గోల్పారా జిల్లాలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని చంపింది. అటవీ శాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2,300 మంది ప్రాణాలు కోల్పోగా.. 2011 నుంచి ఇప్పటివరకు 700 ఏనుగులు చంపివేయబడ్డాయి.

మరిన్ని వార్తలు