ఇంగ్లిష్ చానల్‌ను ఈదేశాడు!

30 Jul, 2014 23:28 IST|Sakshi
ఇంగ్లిష్ చానల్‌ను ఈదేశాడు!

13.13 గంటల్లో లక్ష్యాన్ని ముద్దాడిన పుణేవాసి

పింప్రి, న్యూస్‌లైన్: ప్రతికూల వాతావరణం... ఒకదాని వెనుక మరొకటిగా వచ్చి అడ్డుకుంటున్న అలలు... గమ్యం ఎక్కడుందో కనబడని కటిక చీకటి... అయినా ముందుకు సాగాడు. పోటుపాట్లను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ ఉపోద్ఘాతమంతా పుణే నగరానికి చెందిన రోహన్ మోరే గురించి. ఇంతకీ ఆయన ఏం ఘనకార్యం సాధించాడనే కదా? ఆ వివరాల్లోకెళ్తే... పుణేకు చెందిన రోహన్ మోరే ఇంగ్లీష్ చానెల్ సులువుగా ఈది సత్తాను చాటాడు. ఇంగ్లిష్ చానల్‌ను ఈదాలన్న తన చిరకాల వాంచను ఈ నెల 26వ తేదీన నెరవేర్చుకున్నాడు.
 
13 గంటల 13 నిమిషాల్లో సుమారు 35 కిలోమీటర్ల సముద్రాన్ని ఈది గమ్యం చేరుకున్నాడు. తన సముద్ర ప్రయాణం గురించి ఆయన మాట్లాడుతూ... ‘ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్యగల ఇంగ్లిష్ చానల్‌ను ఈదేందుకు ఈ నెల 26వ తేదీన రాత్రి 10 గంటలకు ఇంగ్లండ్ సముద్ర తీరానికి చేరుకున్నాను. ఈదడం ప్రారంభించిన తర్వాత సుమారు ఐదు గంటలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారింది. అలల తాకిడి పెరిగింది. దీంతో ఈదడం చాలా కష్టమైంది. చిమ్మ చీకటిలో ఎటువైపు వెళ్తున్నానో కూడా తెలియలేదు. సరిగ్గా ఆ సమయంలో ఓ బోటు కనిపించింది.
 
దాని వెనకే వెళ్తే ఫ్రాన్స్ తీరం చేరుకోవచ్చని నిర్ణయించుకొని శక్తినంతా కూడదీసుకున్నా. దానివెంటే ఈదడాన్ని కొనసాగించాను. అయితే బోటువల్ల వచ్చే అలల తాకిడి కూడా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ ముందుకు సాగాను. లక్ష్యసాధన ముందు అలలు, చీకట్లు పటాపంచలయ్యాయి. కనుచూపు మేరలో ఫ్రాన్స్ తీరంలోని ఫినిష్ క్యాప్ పాయింట్ కనిపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వేగం పెంచాను. 13 గంటల్లో తీరాన్ని చేరుకున్నాన’ని చెప్పాడు.
 
1996లో మహారాష్ర్ట జలతరణ్ సంఘటన ఆధ్వర్యంలో నిర్వహించిన ధురంతర్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు సముద్రంలో మొదటిసారిగా ఈదానని చెప్పాడు. దీంతో ఇంగ్లీష్ చానెల్‌ను ఈదాలన్న పట్టుదల పెరిగిందని, అందుకు అవసరమైన శిక్షణ దేశ విదేశాలు తిరిగానని చెప్పాడు. తన ప్రయత్నానికి నేషన్ స్పోర్ట్స్ ట్రస్టు, పుణే అంతర్జాతీయ మారథాన్ సమితి సహాయ సహకారాలు అందించాయని చెప్పాడు. తన లక్ష్యం నెరవేరేందుకు సహకరించిన ఆర్థిక సాయం చేసిన అభయ్ దాడే, తీర్ఫీదునిచ్చిన ఫ్రెండా స్ట్రీటర్(ఇంగ్లండ్)లకు కృత జ్ఞతలు తెలిపాడు. స్ట్రీటర్ కుమార్తె ఎలీనా స్ట్రీటర్ ఇంగ్లిష్ చానల్‌ను 49 సార్లు ఈదిందని, ఆమె కూడా కొన్ని మెలకువలు నేర్పిందన్నారు.

మరిన్ని వార్తలు