పోకిరీల భరతం పట్టిన అక్కాచెల్లెళ్లు

1 Dec, 2014 04:07 IST|Sakshi
పోకిరీల భరతం పట్టిన అక్కాచెల్లెళ్లు

రోహ్తక్ (హర్యానా): ఆకతాయిల వేధింపులను మౌనంగా భరించే అబలలం కాదంటూ హర్యానాలోని రోహ్తక్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిరూపించారు. బస్సులో తమను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలకు బుద్ధిచెప్పేందుకు తోటి ప్రయాణికులెవరూ ముందుకు రాకున్నా ధైర్యంగా వారిని ప్రతిఘటించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. రోహ్తక్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు రోజూలాగే శుక్రవారం కాలేజీకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కగా వారు కూర్చున్న సీట్ల వెనక నిలబడిన ముగ్గురు పోకిరీలు వేధించడం మొదలుపెట్టారు. కాగితాలు చింపి విసరడం, అసభ్య చేష్టలు ప్రారంభించారు.

దీనిపై  యువతులు అభ్యంతరం తెలపడంతో ఆగ్రహించిన పోకిరీల్లో ఒకడు ఒక యువతిపై దాడి చేశాడు. మరో ఇద్దరు పోకిరీలు రెండో యువతిని గట్టిగా పట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా బస్సులోని ప్రయాణికులెవరూ ఆకతాయిలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఎలాగోలా అక్కాచెల్లెళ్లిద్దరూ ధైర్యాన్ని కూడదీసుకొని ఆకతాయిలపై ఎదురుతిరిగారు. పోకిరీలపై పిడిగుద్దులు కురిపించారు. ఒక యువతి ఏకంగా తన బెల్టు తీసి ఓ పోకిరీని చితక్కొట్టింది.

అయితే బస్సు ఆగడంతో పోకిరీలు ఆ యువతులను బస్సులోంచి తోసేశారు. అనంతరం కాన్ల్సా అనే గ్రామంలో బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ దాడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించినఒక ప్రయాణికుడు వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం బయటపడింది.

నిందితులపై బాధిత యువతుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిని కుల్‌దీప్, మోహిత్, దీపక్‌లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ శశాంక్ ఆనంద్ తెలిపారు. మరోవైపు ఈ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పంచాయతీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని యువతుల తండ్రి చెప్పారు.
 

మరిన్ని వార్తలు