చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

23 Jul, 2019 14:59 IST|Sakshi
ముత్తయ్య వనిత, రితు కరిధల్

న్యూఢిల్లీ: దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. చంద్రయాన్ -2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగింది. ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరనుంది. చంద్రయాన్‌-2 చంద్రుని కక్ష్య చేరేందుకు 45 రోజుల సమయం పట్టనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం ఉపగ్రహం నుంచి లాండర్‌ వేరుపడనుంది. ఇస్రో వ్యవస్థాపక శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ పేరును లాండర్‌కు పెట్టారు.

ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఉన్న ఇద్దరు మహిళలను దేశం మొత్తం ప్రశంసిస్తోంది. భారతదేశ చరిత్రలో మొదటిసారి, ఇస్రో యాత్రకు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ముత్తయ్య వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్ కాగా, రితు కరిధల్ చంద్రయాన్ -2 మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రయోగం విజయవంతం కావడంలో మహిళల పాత్ర కూడా కీలకం. దాదాపు 30శాతం మంది మహిళలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. భారతదేశపు అంతరిక్ష మిషన్ చరిత్రలో మొదటిసారి మహిళా శాస్త్రవేత్తల నేతృత్వంలో ప్రయోగం జరిగింది. ఈ మిషన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తలను యావత్‌ దేశం అభినందిస్తోంది.

మరిన్ని వార్తలు