90 వాచీలు.. 9 కోట్లు.. కొట్టేశాడు!

3 Sep, 2014 22:25 IST|Sakshi

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు. అందుకే.. నేరుగా ఓ వాచీల దుకాణంలోకి దూరాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 90 వాచీలు కొట్టేశాడు ఆఫ్ట్రాల్ 90 వాచీలతో ఏమైపోతుందని అనుకుంటున్నారా.. వాటి విలువ అక్షరాలా 9 కోట్ల రూపాయలు! అంటే, ఒక్కోటీ సుమారు 10 లక్షలన్న మాట!! వాచీల దుకాణం పక్కనే బంగారం దుకాణం ఉన్నా.. పుత్తడి జోలికి వెళ్లకుండా రోలెక్స్ వాచీల మీదే మనసుపడ్డాడు మన దొంగ గారు! దేశ రాజధాని న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్ ప్రాంతంలో గల కుకీ అండ్ కెల్వీ షోరూంలో ఈ ఘరానా దొంగతనం జరిగింది.
 

ఈ వాచీల గురించి, వాటి ఖరీదు గురించి బాగా తెలిసిన దొంగే ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. చోరీ స్థలంలో ఓ బాలుడి వేలిముద్రలు కూడా ఉన్నాయని ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. అంటే.. సదరు దొంగగారు ఓ చిన్న పిల్లాడిని కూడా వెంటపెట్టుకుని వచ్చి షట్టర్ తెరిచి దొంగతనానికి పాల్పడ్డాడన్న మాట. షోరూంలో ఇంత విలువైన వస్తువులున్నా.. సీసీ కెమెరాలు అమర్చకపోవడం యాజమాన్యం నిర్ల్యక్షమే. దొంగతనం జరిగిన సమయంలో ఆ షోరూం బయట సెక్యూరీటీ గార్డు విధిలో ఉన్నాడు. అప్పటికే తాను నిద్రపోయానని అతగాడు చెప్పడంతో అతడి హస్తం కూడా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది, మానేసిన సిబ్బందిని కూడా విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు