వరవరరావును తక్షణమే ఆస్పత్రికి తరలించండి

13 Jul, 2020 19:55 IST|Sakshi
రొమిలా థాపర్‌

ముంబై: బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టై విచారణ ఖైదీగా నిర్బంధంలో ఉన్న విప్లవ కవి పి.వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్,‌ ప్రభాత్‌ పట్నాయక్‌ సహా పలువురు ఆక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారేలా వ్యవహరించడం సరికాదని.. ఓ వ్యక్తిని అలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టమని ఏ చట్టం చెప్పదని పేర్కొన్నారు. ఇది ఎన్‌కౌంటర్‌ కంటే తక్కువేమీ కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

ఈ మేరకు రొమిలా థాపర్‌, ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌, దేవకీ జైన్‌, సోషలిస్టు సతీశ్‌ దేశ్‌పాండే, మానవ హక్కుల కార్యకర్త మజా దారూవాలా మహా సర్కారు, జాతీయ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ‘‘అన్నీ తెలిసి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ వ్యక్తికి వైద్య చికిత్స అందించేందుకు నిరాకరించి.. ఆ వ్యక్తి ప్రాణాలకు హాని కలిగేలా వ్యవహరించడం ఎన్‌కౌంటర్‌కు మరో రూపంలా పరిణమిస్తుంది. కాబట్టి పి. వరవరరావుకు తక్షణమే సరైన చికిత్స అందేలా భారత రాష్ట్రం చర్యలు తీసుకోవాలి. గత 22 నెలలుగా వరవరరావు విచారణకు అన్ని విధాలులగా సహకరిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించేలా పరిస్థితులను కల్పించమని చట్టంలో లేదు’’ అని పేర్కొన్నారు.

అదే విధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం ఆయనకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్రలోని పుణేలో గత ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు ఆయనను తరలించారు. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుతో జైలు అధికారులు తనతో ఫోన్లో మాట్లాడించారని, వీవీ మాట్లాడిన తీరు పొంతన లేకుండా ఉందని, మాట మొద్దు బారిపోయిందని ఆయన సహచరి హేమలత ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. వరవరరావుకు వెంటనే బెయిలు మంజూరు చేసి ఆయనకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.(జైలులోనే చంపుతారా?)

మరిన్ని వార్తలు