సింగర్‌గా మారిన ఫైర్‌బ్రాండ్‌ డీఐజీ

9 Mar, 2018 20:47 IST|Sakshi
రూపా ముగ్దిల్‌

సాక్షి, బెంగళూరు : ఫైర్‌బ్రాండ్‌ పోలీసు అధికారిణిగా పేరొందిన కర్ణాటక డీఐజీ (జైళ్ల శాఖ) రూపా ముగ్దిల్‌ తనలో దాగున్న మరో ప్రతిభను బయటపెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక మ్యూజిక్‌ వీడియోను విడుదల చేశారు. 1965లో విడుదలైన మీనా కుమారి - ధర్మేంద్రల ‘కాజల్‌’  సినిమాలోని ‘తోరా మన్‌ దర్పణ్‌ కెహలాయె’  అంటూ సాగే పాటను ఆమె స్వయంగా ఆలపించారు. ‘ఈ పాట ఆడియో రికార్డింగ్‌ కోసం కేవలం అరగంట సమయం మాత్రమే పట్టింది. వీడియో చిత్రీకరణ కూడా నాలుగు గంటల్లో ముగించేశాం’ అని రూపా చెప్పారు. తమలో దాగున్న శక్తిని గుర్తించాలంటూ సాగే ఈ పాట తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని, అందుకే ఈ వీడియో రూపొందించినట్లు తెలిపారు. మనసే అందరిలోని సంతోషం, దుఃఖానికి, సాధించే విజయాలు, అపజయాలకు కారణమని.. బలంగా అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీలేదని అందరూ గుర్తించాలన్నారు. ఈ వీడియో మ్యూజిక్‌ కంపోజర్‌గా కన్నడ సినీ దర్శకుడు అలెన్‌ వ్యవహరించారు. ఆర్జే శృతీరావు కోరిక మేరకు వీడియోను రూపొందించానని రూపా తెలిపారు.

పరప్పణ అగ్రహార సెంట్రల్‌ జైలులో ఖైదీగా ఉన్న అన్నాడీఎంకే నేత శశికళకు ప్రత్యేకంగా రాజభోగాలు కల్పిస్తున్నారంటూ నివేదికనిచ్చి ఒక్కసారిగా సంచలనంగా రూపా నిలిచారు‌. గతంలో కూడా ధార్వాడ్‌(మధ్యప్రదేశ్‌) ఎస్పీగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమా భారతిని అరెస్ట్‌ చేసి ఆమె సంచలనం సృష్టించిన విషయం విదితమే.   
 

మరిన్ని వార్తలు