భారత్‌లో రోటావైరస్ వ్యాక్సిన్

27 Mar, 2016 02:32 IST|Sakshi
భారత్‌లో రోటావైరస్ వ్యాక్సిన్

♦ చారిత్రక ఘట్టానికి తెరదీసిన కేంద్రం
♦ తొలి విడతగా ఏపీ సహా 4 రాష్ట్రాల్లో
 
 భువనేశ్వర్: ఏటా దేశంలో లక్షమంది పిల్లల ప్రాణాలు తీసుకుంటున్న అతిసార నియంత్రణకు కేంద్రం చారిత్రక చర్య చేపట్టింది. శనివారమిక్కడ ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా రోటావైరస్ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. చిన్నారుల రోగనిరోధక శక్తిని బలపరిచేలా చర్యలు తీసుకోవటం చాలా అవసరమనిచ అందుకోసమే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ (యూఐపీ)లో భాగంగా.. పోలియా, మశూచి, రోటావైరస్, అడల్ట్ జపనీస్ ఎన్సెఫిలిటీస్ వ్యాధులకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ‘ఇది భారత ఆరోగ్య వ్యవస్థలో  మైలు రాయి.

ఈ టీకాలతో దేశంలోని 2.7 కోట్ల మంది పిల్లలను 12 ప్రాణాంతకమైన వ్యాధులనుంచి రక్షించటం లక్ష్యంగా పెట్టుకున్నాం. దీంతో పాటు కుష్టు, టీబీ వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తి స్థాయిలో పార దోలేందుకు కృషిచేస్తున్నాం’ అని తెలిపారు. రోటా వైరస్ టీకాను మొదటి విడతగా.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోని ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నామని.. దశల వారిగా దేశమంతా దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే ఒడిశాలో అతిసారం కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఒడిశాలోని మొత్తం వ్యాధులు సోకినవారిలో 9.2 శాతం డయేరియా రోగులే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేటు 8, హరియాణాలో 8.5, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో 5.5 శాతంగా ఉంది.

>
మరిన్ని వార్తలు