రోడ్డు ప్రమాదాల బాధితుల్లో 40% యువతే!

14 Jul, 2014 01:59 IST|Sakshi
రోడ్డు ప్రమాదాల బాధితుల్లో 40% యువతే!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 40 శాతానికి పైగా 24 ఏళ్ల వయసున్న యువతే బాధితులుగా మిగులుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) తన నివేదికలో స్పష్టం చేసింది. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5,879 మంది చిన్నారులు(0-14 ఏళ్లు) బాధితులు కాగా, 26,709(15-24 ఏళ్లు) మంది యువత అంగ వికలురుగా మిగిలారని నివేదిక స్పష్టం చేసింది. ఇదిలావుంటే, ఏటా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి శాతంతో పోల్చుకుంటే మన దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారు 11శాతంగా ఉన్నారని వివరించింది.

2003లో 18 శాతంగా ఉన్న రోడ్డు ప్రమాదాలు 2012 నాటికి 25 శాతానికి పెరిగాయని ప్రభుత్వ అధికారిక నివేదికే స్పష్టం చేస్తోందని సీఎస్‌ఈ పేర్కొంది. రహదారులపై మితిమీరుతున్న వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా గుర్తించినట్టు తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో ఏటా కనీసం 5 వేల మందికి మేజర్ ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని, మోటారు వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య భారీగా ఉందని, ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ గుర్తించిందని నివేదిక స్పష్టం చేసింది.
 
 

మరిన్ని వార్తలు