టెన్త్‌ బోర్డు నిర్వాకం.. తీవ్ర విమర్శలు

7 Mar, 2020 21:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ టెన్త్‌ బోర్డు చేసిన నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి సాంఘీక శాస్త్రం పరీక్షా పత్రంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ‘స్వతంత్ర కశ్మీర్‌’అని టెన్త్‌ బోర్డు పేర్కొంది. పరీక్షా పేపర్‌లోని నాలుగో ప్రశ్నలో ఈ తప్పు దొర్లింది. ఈ కింది వానిని జతపరుచుము అని పేర్కొన్న బోర్డు.. ఐదు ఐచ్ఛికాల (ఆప్షన్లు)ను ఇచ్చింది. (ఎ) బహదూర్‌ షా, (బి) కాంగ్రెస్‌ విభజన, (సి) భారత్‌ పాకిస్తాన్‌ యుద్ధం, (డి) సీఓపీఆర్‌ఓ, (ఇ) హాల్‌మార్క్‌ అని ఇచ్చింది. వాటికి ఎదురుగా.. (1) సూరత్‌, (2) వినియోగదారుల పరిరక్షణ చట్టం, (3) బంగారు ఆభరణాలు, (4) ఢిల్లీ, (5) స్వతంత్ర కశ్మీర్‌ అని పేర్కొంది. మరో ప్రశ్నలో కూడా అదే పొరపాటు చేసింది. భారత చిత్రపటంలో స్వతంత్ర కశ్మీర్‌ను గుర్తించండి అని ప్రశ్నించి అభాసుపాలైంది.

‘స్వతంత్ర కశ్మీర్‌’ దుమారం నేపథ్యంలో బీజేపీ నేత విశ్వాస్‌ సారంగ్‌ మాట్లాడుతూ.. ‘అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే. స్వంత్రం కశ్మీర్‌ అని పేర్కొనడం ముమ్మాటికి రాజద్రోహమే. వక్రబుద్ధితోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. హిందుస్తాన్‌లో కాంగ్రెస్‌, పాకిస్తాన్‌ ఎజెండా అమలు చేయాలని చూస్తారా’అని విమర్శించారు. ఇదిలాఉండగా.. బాధ్యులపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌  చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నరేంద్ర సాలుజా స్పష్టం చేశారు. కాగా, సీఎం ఆదేశాలమేరకు పేపర్‌ సెట్‌ చేసిన అధికారిని సస్పెండ్‌ చేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు