అర్జున్‌ సింగ్‌ విగ్రహం ఏర్పాటుపై వివాదం

11 Nov, 2019 09:00 IST|Sakshi
అర్జున్‌ సింగ్‌ (ఫైల్‌)

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దివంగత మాజీ కేంద్రమంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అర్జున్‌ సింగ్‌ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. భోపాల్‌ లోని రద్దీగా ఉండే ఓ రోడ్డు జంక్షన్‌లో అర్జున్‌ సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో అక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్‌ అజాద్‌ విగ్రహం ఉండేది. ఆ ప్రదేశంలోనే అర్జున్‌ సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

‘అజాద్‌ విగ్రహం గతంలో ఎక్కడ ఉండేదో తిరిగి అక్కడే ప్రతిష్టించాల’ని ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘దేశమాత ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్‌ అజాద్‌ విగ్రహం తొలగించడం ఆయనను అవమానించడమే. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. అజాద్‌ విగ్రహాన్ని తొలగించిన చోటనే పునః ప్రతిష్టించాలి. లేదంటే దేశం వారిని ఎన్నటికీ క్షమించదు’ అని చౌహన్‌ అన్నారు.

‘ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ చేసే పనుల్లో భాగంగా మూడేళ్ల క్రితమే అజాద్‌ విగ్రహాన్ని తీసి మరో ప్రదేశంలో నెలకొల్పార’ని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. అర్జున్‌ సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి కాంగ్రెస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పౌరసంఘాల అధికారులు తనను ఎప్పుడూ సంప్రదించలేదని బీజేపీ నేత, భోపాల్‌ మేయర్‌ అలోక్‌ శర్మ స్పష్టం చేశారు. దీనిపై బీఎంసీ కమిషనర్‌ బి.విజయ్‌ దత్తా వాదన మరోలా ఉంది. అర్జున్‌ సింగ్‌ విగ్రహం ఏర్పాటు గురించి కాంగ్రెస్‌నేతలు, బీఎంసీ అధికారులు మేయర్‌ను కలిశామని, అయితే ఆ విషయాన్ని మాత్రం మేయర్‌ వెల్లడించడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈనెల 11న అర్జున్‌సింగ్‌ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

మరిన్ని వార్తలు