జిన్నా ఫొటోపై వివాదం

2 May, 2018 01:39 IST|Sakshi

ఏఎంయూ వీసీ వివరణ ఇవ్వాలని బీజేపీ ఎంపీ డిమాండ్‌

అలీగఢ్‌ (యూపీ): అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నా చిత్రపటం ఉండటంపై వివాదం చెలరేగుతోంది. వర్సిటీలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) తారిఖ్‌ మన్సూర్‌కు లేఖ రాశారు. వారం కిందట ఏఎంయూలో ఆరెస్సెస్‌ శాఖ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఓ విద్యార్థి కోరగా.. వీసీ అందుకు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో ఏఎంయూ స్టూడెంట్‌ యూనియన్‌ కార్యాలయంలో ఉన్న జిన్నా చిత్రపటంపై సతీశ్‌ గౌతమ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్‌ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్‌ కోసం డిమాండ్‌ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు.

అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్‌ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద. మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, నెహ్రూలతో సహా ఏ జాతీయ నాయకుడూ ఆ చిత్రపటం గురించి అభ్యంతరం వ్యక్తం చేయలేదు’అని చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్‌ శాఖ ఏర్పాటుకు అనుమతిపై వివరణ ఇస్తూ వర్సిటీలో రాజకీయ పార్టీలు, దాని అనుబంధ సంస్థల ప్రత్యక్ష ప్రవేశానికి తావు లేదన్నారు.

మరిన్ని వార్తలు