రియల్‌ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్‌

4 Jun, 2020 19:20 IST|Sakshi

భోపాల్‌ : అచ్చం సినిమా సీన్‌ తరహాలో పరిగెడుతున్న రైలులో పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఒక నాలుగేళ్ల చిన్నారికి పాల పాకెట్‌ను అందించి రియల్‌ హీరోగా మారాడు ఒక ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌. ఆ కానిస్టేబుల్‌ మానవతా దృక్పథానికి కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌ కూడా ముగ్దులయ్యారు. వివరాల్లోకి వెళితే.. 33ఏళ్ల ఇందర్‌ సింగ్‌ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలసకూలీల కోసం బెల్గాం నుంచి గోరఖ్‌పూర్‌కు వెళుతున్న శ్రామిక్‌ రైలు అక్కడికి చేరుకుంది. అదే రైలులో హసీన్ హష్మి తన భార్య షరీఫ్‌ హష్మి, నాలుగేళ్ల చిన్నారితో కలిసి గోరఖ్‌పూర్‌లోని సొంతూరుకు వెళుతున్నాడు. అప్పటికే పాల కోసం నాలుగేళ్ల చిన్నారి గుక్క పట్టి ఏడుస్తున్నాడు. మధ్యలో రెండు మూడు రైల్వే స్టేషన్‌లలో రైలు ఆగినా వారికి పాలు దొరకలేదు. (విషాదం : కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయాయి)

ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఇందర్‌ సింగ్‌కు చెప్పి తమకు సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన ఇందర్‌ సింగ్‌ రైల్వే స్టేషన్‌ బయటకు పరిగెత్తి ఒక షాపులో పాలపాకెట్‌ను కొని మళ్లీ పరిగెత్తుకొచ్చాడు. కానీ అప్పటికే రైలు కదిలిపోయింది. కానీ ఇందర్‌ సింగ్‌ మాత్రం ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా రైలు వెంట పరిగెడుతూ చివరికి ఎలాగోలా షరీఫ్‌ హష్మికి కిటికీలోంచి పాలపాకెట్‌ను అందించాడు. ఈ వీడియో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.ఇప్పుడు ఇందర్‌ సింగ్‌ రియల్‌ హీరోగా మారిపోయాడు. (పైలట్‌ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం)

ఈ వీడియోనూ చూసిన కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఇందర్‌ సింగ్‌ నిజమైన హీరో అంటూ ట్విటర్‌ వేదికగా పొగడ్తలతో ముంచెత్తాడు. ' ఇందర్‌ సింగ్‌ ఇవాళ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి ఆకలి తీర్చేందుకు అతను చేసిన సాహసం నిజంగా అభినందించదగ్గది. కదులుతున్నరైలు వెంబడి పరిగెడుతూ చివరికి చిన్నారి తల్లికి పాలపాకెట్‌ అందించి గొప్ప మనుసును చాటుకున్నాడు.. ఇందర్‌ సింగ్‌' అంటూ పేర్కొన్నాడు. కాగా ఈ ఘటన మే 31న చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు