మా సీట్లు మాకు కావాలే..

20 Aug, 2014 22:18 IST|Sakshi

సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాషాయ కూటమి తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. బాంద్రాలోని రంగశారద సభాగృహంలో జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి చిహ్నంపై తమ అభ్యర్థులు పోటీ చేయబోరని, తమ పార్టీ గుర్తుపైనే పోటీచేస్తారని కుండబద్దలు కొట్టారు.

ఇంతకుముందు తమ పార్టీకి 40 స్థానాలు కావాలని అడిగినా ప్రస్తుత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 20 స్థానాలు కావాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఆర్పీఐ ఓట్లు గంపగుత్తగా పడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆమేరకు ఆర్పీఐ అభ్యర్థులకు కూటమి పార్టీల ఓట్లు రావడంలేదని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ శాసన సభ ఎన్నికల్లో పరిస్థితుల మారాలంటే ఆ ఓట్లన్నీ ఆర్పీఐ అభ్యర్థులకు పోలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇరు పార్టీల నాయకులకు ఆఠవలే సూచించారు. ఒక కులానికి రిజర్వేషన్ అమలుచేసే ముందు మరో కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. కొద్ది రోజులుగా ధన్‌గర్ సమాజ ప్రజలు రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికి సమాన న్యాయం జరిగే తీరులో తుది నిర్ణయం తీసుకోవాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు.
 
అది మా లిస్ట్ కాదు..
 బీడ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తమ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఇటీవల ఆర్పీఐ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వచ్చిన కథనాలను బుధవారం ఆయన ఖండించారు. ఎవరో కూటమిని తప్పుదోవ పట్టించేందుకు ఇలా అసత్యాలను ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. తాము అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మీడియా ద్వారానే బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తప్పుడు కథనాల వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. బీజేపీ,శివసేన కూటమికి తాము 57 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను అందజేశామని, వాటిలో 20 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని రాందాస్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రవర్తించినట్లు ఇప్పుడు కాషాయ కూటమి ప్రవర్తిస్తుందని అనుకోవడంలేదని, ఆర్పీఐ అండ లేకుండా దళితుల ఓట్లను సాధించడం కూటమి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.

 తమ పార్టీలో ఇప్పటికే నటి రాఖీ సావంత్ చేరగా, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ త్వరలో చేరనున్నట్లు వివరించారు. కాగా, బీడ్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా