మేఘాలయ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా

4 Jul, 2019 03:23 IST|Sakshi

న్యూఢిల్లీ: అక్రమ బొగ్గు తవ్వకాలను అరికట్టడంలో విఫలమైనందున నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) విధించిన రూ .100 కోట్ల జరిమానాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)లో జమ చేయాలని మేఘాలయ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అక్రమంగా సేకరించిన మొత్తం బొగ్గును కోల్‌ ఇండియాకు అప్పగించాలని  సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సంబంధిత అధికారుల అనుమతులకు లోబడి ప్రైవేటు, కమ్యూనిటీ యాజమాన్యంలోని భూముల్లో మైనింగ్‌ ఆపరేషన్‌ రాష్ట్రంలో కొనసాగడానికి ధర్మాసనం అనుమతించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జనవరి 4న మేఘాలయ ప్రభుత్వానికి జరిమానా విధించింది. మేఘాలయలో పెద్ద సంఖ్యలో గనులు అక్రమంగా పనిచేస్తున్నాయని మేఘాలయ అంగీకరించింది. గౌహతి హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌  కకోటి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రకారం, మేఘాలయలో 24 వేల గనులుండగా, ఎక్కువ భాగం అనుమతులు లేనివేనని పేర్కొంది.  

మరిన్ని వార్తలు