ఆర్థిక ప్యాకేజీపై వలస కూలీల స్పందన

13 May, 2020 15:42 IST|Sakshi

లక్నో: కరోనా వల్ల పట్టాలు తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్యాకేజీ పట్ల పేదలు ముఖ్యంగా వలస కార్మికులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు కొందరు రిపోర్టర్లు ప్రయత్నించారు. మరి వారి స్పందన ఏంటో చూడండి..

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మీ సాహు అనే మహిళ ఉపాధి కోసం ఉ‍త్తర ప్రదేశ్‌ రాజధాని లక్నో వెళ్లారు. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సైకిల్‌పై 500కిలోమీటర్ల దూరాన ఉన్న సొంత ఊరికి ప్రయాణమయ్యారు. రిపోర్టర్లు లక్ష్మీని కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ గురించి ప్రశ్నించగా.. ‘ఈ వార్త గురించి విన్నప్పుడు కాస‍్త సంతోషమేసింది. కానీ ఈ ప్యాకేజీ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. గతంలో కూడా ఓ ప్యాకేజీ ప్రకటించారు. డబ్బులు ఇస్తారు, రేషన్‌ ఇస్తారు అన్నారు. మూడు రేషన్‌ దుకాణాల్లో ఆధార్‌ కార్డు ఇచ్చాను.. కానీ మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ప్యాకేజీ సంగతి దేవుడెరుగు.. కనీసం మాకోసం బస్సులను అయినా ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం మమ్మల్ని కూడా పట్టించుకుంటుంది అని భావించే వాళ్లం. ప్రభుత్వ పథకాలు మాలాంటి వలస కూలీలకు అందడం లేదు. అందుకే సొంత ఊరికి వెళ్తున్నాం. కనీసం అక్కడ పొలం పనులయినా దొరుకుతాయి’ అని లక్ష్మీ సాహు ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు