రూ.2000 నోట్లు అదృశ్యమైపోతున్నాయ్

16 Apr, 2018 19:37 IST|Sakshi

భోపాల్‌ : పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్‌లోకి తీసుకొచ్చిన రూ.2000 నోట్లు ఇటీవల చలామణిలో తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ఏటీఎంలలో కూడా ఈ నోట్లు తక్కువగానే వస్తున్నాయి. అయితే రూ.2000 నోట్లు మార్కెట్‌ నుంచి అదృశ్యమైపోతున్నాయని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా మండిపడ్డారు. దీని వెనుక అతిపెద్ద కుట్రే ఉందని ఆయన ఆరోపించారు. రైతుల సమావేశంలో పాల్గొన్న చౌహాన్‌, డిమానిటైజేషన్‌కు ముందు రూ.15,00,000 కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండేవని తెలిపారు.  డిమానిటైజేషన్‌ తర్వాత కరెన్సీ సర్క్యూలేషన్‌ రూ.16,50,000 కోట్లకు పెరిగిందని, కానీ రూ.2000 నోట్లు మార్కెట్‌ నుంచి అదృశ్యమైపోతున్నట్టు చెప్పారు. 

రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. రూ.2000 డినామినేషన్‌ నోట్లను ఎక్కడికి పోతున్నాయ్‌? వాటిని ఎవరూ సర్క్యూలేషన్‌ నుంచి బయటికి తీసుకుపోతున్నారు? నగదు కొరతకు బాధ్యులెవరు? ఈ సమస్యలను సృష్టించడానికి ఏదో కుట్ర జరుగుతోంది. దీనిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లనున్నట్టు చౌహాన్‌ తెలిపారు.  ప్రతిపక్ష పార్టీ  కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఏమైనా వ్యవసాయ సమస్యలుంటే రైతులు తన అధికారిక రెసిడెన్సీలోని కంట్రోల్‌ రూం నెంబర్‌ 0755-2540500 కు కాల్‌ చేయాలని సూచించారు. వ్యవసాయదారుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండవని చౌహాన్‌ చెప్పారు. 
 

మరిన్ని వార్తలు