600 ఎస్ఎఫ్‌టీ ఇంటికి రూ. 4.53 కోట్ల ఆస్తిపన్ను!

29 May, 2017 16:10 IST|Sakshi
600 ఎస్ఎఫ్‌టీ ఇంటికి రూ. 4.53 కోట్ల ఆస్తిపన్ను!

పూరి గుడిసెకు వేలల్లో కరెంటు బిల్లులు రావడం ఇంతవరకు చూశాం. కానీ, సరిగ్గా 600 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణం మాత్రమే ఉన్న ఓ చిన్న ఇంటికి ఏకంగా 4.5 కోట్ల రూపాయల ఆస్తిపన్ను విధించి బెంగళూరు కార్పొరేషన్ అధికారులు కొత్త చరిత్ర సృష్టించారు. అస్లాం పాషా అనే వ్యక్తికి దక్షిణ బెంగళూరులోని కావేరి నగర్‌లో చిన్నపాటి ఇల్లుంది. అతడు రూ. 4,53,32,161 ఆస్తిపన్ను కట్టాలని మెసేజ్ వచ్చింది. నోటీసు మాత్రం ఇంకా రాకపోవడంతో అతడికి అనుమానం వచ్చి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. తాను బీబీఎంపీ కార్యాలయానికి పన్ను చెల్లించేందుకు వెళ్లానని, అయితే అక్కడేదో సమస్య ఉందని చెప్పి తర్వాత రమ్మన్నారని, తనకు నోటీసు కూడా ఇంకా ఇవ్వలేదని పాషా తెలిపారు.

మే నెలాఖరులోగా ఆస్తిపన్ను చెల్లించేవారికి 5% రాయితీ ఇస్తామని బీబీఎంపీ ప్రకటించింది. కానీ దాన్ని లెక్కపెట్టడంలో మాత్రం ఏదో సాంకేతిక లోపం వచ్చింది. దాంతో ఆ సాఫ్ట్‌వేర్ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ లోపం వల్లే.. గత సంవత్సరం తన జి+2 ఇంటికి రూ. 6235 పన్ను చెల్లించిన శ్రీనివాసమూర్తికి ఈసారి రూ. 1.59 కోట్ల పన్ను వచ్చింది. ఈ లోపాన్ని సరిచేయలేని అధికారులు.. ఇలాంటి సమస్యలతో వస్తున్న వాళ్లను తిరిగి మరోసారి రమ్మని మాత్రమే చెబుతున్నారు.

అసలు విషయం ఇదీ..
అస్లాం పాషా ఇంటి విషయంలో మొత్తం 2వేల అంతస్తులు ఉన్నట్లుగా ఎంటర్ చేశారని, శ్రీనివాసమూర్తి కేసులో కూడా 450 అంతస్తులు ఉన్నట్లు ఎంటర్ చేశారని, ఇది మానవ తప్పిదమే తప్ప సాఫ్ట్‌వేర్ లోపం కాదని బీబీఎంపీ జాయింట్ కమిషనర్ ఎం. వెంకటాచలపతి చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా